Baby Food: పిల్లలను చూసుకోవడం అంత ఈజీ కాదు. అయితే చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతాయి. ఎప్పుడు తినిపించాలి, ఏమి తినిపించాలి? ఇలాంటి ఆలోచనలు రావడం కామన్. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు శిశువు తన ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలను తల్లి పాలు నుండి పొందుతుంది. ఆ సమయంలో వారికి వేరే ఏమీ అవసరం లేదు. ఆ తర్వాత చాలామంది శిశువుకు ఘనమైన ఆహారం అంటే తృణధాన్యాలు, పిల్లలకు పోషకమైన ఆహారాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. అయితే ఇలాంటి ఫుడ్ ఎప్పుడు పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శిశువుకు 6 నెలల వయస్సు వచ్చే వరకు తల్లి పాలు కాకుండా ఇతర ఆహారాన్ని తినిపించవద్దు. ఎందుకంటే ఇది డయేరియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. అంతేకాదు ఒక్కోసారి పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కాబట్టి బిడ్డకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వండి. ఈ కాలంలో నీరు, టీ, రసం, గంజి లేదా మరే ఇతర ఆహారం లేదా ద్రవ ఆహారం ఇవ్వకూడదు.
స్నాక్స్ ఏ సమయంలో ఇవ్వాలి?
మీ బిడ్డ పెరుగుతున్న కొద్దీ పోషక అవసరాలు కూడా పెరుగుతాయి. జీవితంలో మొదటి రెండేళ్లలో 75 శాతం ఆహారం శిశువు యొక్క మెదడు పెరుగుదలకు అవసరమవుతుంది. శిశువుకు ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు, రోజుకు రెండుసార్లు గంజి, ఒలిచిన పండ్లు లేదా కూరగాయలు వంటి తేలికపాటి ఆహారాన్ని కేవలం రెండు నుండి మూడు స్పూన్లు ఇవ్వడం ప్రారంభించండి. అలాగే మునుపటిలాగే తరచుగా తల్లిపాలను కొనసాగించండి.
ఈ తప్పు చేయవద్దు
మీరు బిడ్డకు ఘనపదార్థాలను తినిపించడం ప్రారంభించినప్పుడు, సబ్బుతో చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే శిశువుకు ఆహారం ఇవ్వాలని గుర్తుంచుకోండి. పిల్లలకు ఘనమైన ఆహారం 6నెలల తర్వాతే ఇవ్వాలి. శిశువు శరీరం పెరగడానికి అదనపు శక్తి, పోషకాలు అవసరం. ఎక్కువ రోజులు ఘన ఆహారం ఇవ్వపోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది శిశువు బరువును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి 6నెలలత ర్వాత శిశువుకు ఘనమైన ఆహారాన్ని ఇవ్వాలి. తద్వారా వారి పెరుగుతున్న శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.