KTR: తెలంగాణలో రాజకీయ దుమారం మళ్లీ ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
ఢిల్లీకి ఏటీఎంలా మారిన తెలంగాణ
కేటీఆర్ తీవ్రంగా ఎద్దేవా చేస్తూ, గత ఏడాదిన్నరలో సీఎం రేవంత్ ఏ పని చేశారు? చేసినదల్లా బీఆర్ఎస్‌పై ఆరోపణలు, ఢిల్లీ బాసులకు వేల కోట్ల చందాలు, కాంట్రాక్టర్లతో దందాలు. ఇది పాలనా పద్ధతా? అని ప్రశ్నించారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు – రాజకీయ సంచలనం
రాష్ట్రానికి పరువు తీసుకువచ్చే విధంగా రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో వెల్లడైందని కేటీఆర్ పేర్కొన్నారు. నీతి, నిజాయితీ ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తప్పించాలి అంటూ తీవ్ర డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు నుంచి సీటుకు రూటు దాకా…
రేవంత్ గత పాలనను గుర్తు చేస్తూ, ఓటుకు నోటు కుంభకోణం అంతా మర్చిపోలేదు. ఇప్పుడు అదే తరహాలో సీటుకు రూటు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా అన్నారు – పీసీసీ పదవి కోసం రూ.50 లక్షలు ఇచ్చారట. ఇదే నిజాయితీనా? అని ప్రశ్నించారు.
జపాన్ పర్యటన వెనుక లుక్కున్న నిజాలు?
నేషనల్ హెరాల్డ్ కేసులో తన పేరొస్తుందని ముందే తెలిసి జపాన్ పర్యటనకి వెళ్లారు రేవంత్. ఇది తప్పించుకునే ప్రయత్నం కాదు? అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.
బీజేపీ – కాంగ్రెస్ గుట్టు విప్పిన కేటీఆర్
బీజేపీ నేతలు కేంద్ర ఏజెన్సీలతో చిన్న పార్టీలను బెదిరిస్తారు కానీ, రేవంత్, డీకే శివకుమార్ వంటి కాంగ్రెస్ నేతలపై మాత్రం మౌనం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అయిపోయాయా? బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ వ్యవహారాలపై స్పందించాలి, అని డిమాండ్ చేశారు.
గవర్నర్‌కు ఫిర్యాదు – రాబోయే కార్యచరణ
బీఆర్ఎస్ పార్టీ త్వరలో గవర్నర్‌ను కలసి ముఖ్యమంత్రి అవినీతి మీద చర్యలు తీసుకోవాలని కోరనుందని కేటీఆర్ తెలిపారు. నెల రోజులలో స్పందన లేకుంటే తాము కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.