Mahaa Bhakthi TV: తెలుగు టీవీ ఛానల్స్ చరిత్రలోనే సంచలం సృష్టించే విధంగా మహా గ్రూప్ నుంచి మహా భక్తి ఛానల్ లాంచింగ్ మహోత్సవం జరగబోతోంది. పన్నెండు గంటల పాటు మహాదేవుని భక్త పారవశ్యంలో అందరూ మునిగి తేలేవిధంగా.. నభూతో నభవిష్యత్ అనే చందంగా మహా భక్తి ఛానల్ ప్రారంభ వేడుక కోసం వేదిక సిద్ధం అవుతోంది. అమరావతి లోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార ఆలయ గ్రౌండ్స్ లో మహా భక్తి ఛానల్ ప్రారంభం సంరంభం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా ఫిబ్రవరి 26 సాయంత్రం 5 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 5 గంటల వరకూ నిర్విరామంగా శివోహం అంటూ భక్త జనం తరించి పోయేలా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. మహా గ్రూప్ ఛైర్మన్, ఎండీ మారెళ్ల వంశీకృష్ణ నేతృత్వంలో శివోహం కార్యక్రమ నిర్వహణ కోసం వేదిక నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.
Mahaa Bhakthi TV: రాత్రి.. పగలు తేడా లేకుండా నిర్విరామంగా వేదిక నిర్మాణం జరుపుకుంటోంది. వేదికపై ఒక పక్క శివలింగం.. మరో పక్క ప్రత్యేకమైన ఆలయ నమూనాతో భారీ వేదిక సిద్ధం అవుతోంది. వేదిక మధ్యభాగంలో 80 అడుగుల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వేదిక ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ ప్రతి అణువులోనూ చూస్తేనే భక్తి పారవశ్యం కలిగించేలా అద్భుతమైన ఆధ్యాత్మిక హంగులను సమకూర్చుతున్నారు.
కార్యక్రమాలు ఇలా..
Mahaa Bhakthi TV: మహా శివ జాగరణ మహోత్సవంగా సాగనున్న శివోహం కార్యక్రమంలో అతిరథ మహారథులు పాల్గొన బోతున్నారు. శ్రీశ్రీశ్రీ మహామండలేశ్వర్ కైలాసానంద గిరిజా మహారాజ్ ఆశీస్సులతో శివ జాగరణ మహోత్సవం జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నారా లోకేష్ బాబులు మహాభక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథులుగా అలరించనున్నారు.
Mahaa Bhakthi TV: ప్రముఖ యాంకర్ ఉదయభాను హోస్ట్ గా వ్యవహరించే ఈ మహా భక్తి వేడుకలో గంగాధర శాస్త్రి, ఘజల్ శ్రీనివాస్ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తారు. అలాగే ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నేపధ్య గాయనీ గాయకులు కౌశల్య, ఉష, రమ్య బెహ్రా, వాగ్దేవి, నిహాల్ కొండూరి, మీరా తమ అమృత గాన మాధుర్యంతో శివయ్యకు ఆధ్యాత్మికాభిషేకం చేస్తారు. ప్రముఖ నృత్య కళాకారిణి సుగమ్య శంకర్ తన అద్భుతమైన నృత్య రీతులతో మహాశివునికి నీరాజనాలు అందిస్తారు.
డీజే, క్లాసికల్ వాటర్ డ్రమ్స్, శివతత్వం పై ర్యాప్ సంగీతం, భరతనాట్యం, వేదం పారాయణం, మంగళ హారతి, శివ వైభవంపై ప్రత్యేక నృత్య ప్రదర్శన, మెడిటేషన్ కార్యక్రమం భక్త జనాన్ని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడించనున్నాయి.
Mahaa Bhakthi TV: దిక్కులన్నీ శివోహం అని ప్రతిధ్వనించేలా.. మహాశివుని ఝటాఝూటం నుంచి జాలువారే గంగమ్మ ప్రవాహంలా మహా భక్తి ఛానల్ ప్రారంభ వేడుక ఆధ్యాత్మిక సిరులను తెలుగురాష్ట్రాల్లో ప్రజలకు ఒక దివ్యానుభూతిని ఇచ్చేలా చేయడానికి మహా గ్రూప్ టీమ్ నిర్విరామంగా కృషిచేస్తోంది. ప్రేక్షక దేవుళ్ళ ఆదరాభిమానాలతో.. మహాదేవుని ఆశీస్సులతో మహా భక్తి ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యపు పరవళ్లను అందించడానికి శరవేగంగా.. సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతోంది. ఈ మహా వేడుకలో భాగస్వాములు కావాలని తెలుగు ప్రజలను అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది మహా గ్రూప్!