BR Gavai: హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీజేఐ గవాయ్ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విదేశీ డిగ్రీల కోసం కుటుంబాలను అప్పుల బారిన పడేలా చేయకూడదని హితవు పలికారు. భారతదేశం నాణ్యమైన న్యాయ విద్యను అందిస్తోందని, ప్రతిభను నిరూపించుకునేందుకు విదేశీ డిగ్రీ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రతిభ అనేది డిగ్రీల వల్ల కాదు, చేసిన పని ద్వారా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
అలాగే న్యాయవాదులుగా సేవ చేయాలంటే అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత అనేవి అత్యంత అవసరమని చెప్పారు. న్యాయవ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, న్యాయవాదులు ప్రజల వాదనలను శ్రద్ధగా వినడం ముఖ్యం అని అన్నారు.
ఇక, కృత్రిమ మేధస్సు (AI) వాడకంపై కూడా సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే తీర్పుల వేగం పెరుగుతుందని, ఇది వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుతుందని అభిప్రాయపడ్డారు.