bandi sanjay: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్టు చెప్పబడుతున్న “లెటర్ టు డాడీ”పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ లేఖను ఓ “ఓటీటీ ఫ్యామిలీ డ్రామా” లాగా అభివర్ణించారు. దానికి టైటిల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ వ్యాఖ్యానిస్తూ, “తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలమయ్యాయి. అందుకే అవి చేతులు కలిపి బీజేపీని బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నాయి. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకం. అది గాంధీ కుటుంబమైనా కావచ్చు, కల్వకుంట్ల కుటుంబమైనా కావచ్చు, తేడా లేదు,” అని స్పష్టం చేశారు.
రాజకీయంగా వాడుకుంటున్నారు
“వారి కుటుంబ సంక్షోభాలు, అంతర్గత గొడవలను ప్రజల భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ ఎవరినీ జైలుకు పంపదు. చట్టం ముందు ఎవరు దోషులుగా తేలితే వారు తగిన శిక్షను అనుభవిస్తారు,” అని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నదని, ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
కవిత లేఖపై చర్చలకు నాంది
ఇదిలా ఉండగా, ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ అనంతరం కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సభ విజయవంతంగా నిర్వహించిన కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ, పాజిటివ్, నెగెటివ్ అంశాలుగా ఎనిమిది కీలక అంశాలను ఆ లేఖలో కవిత ప్రస్తావించినట్లు సమాచారం. గతంలో కవిత రాసిన లేఖల ధోరణికే ఈ లేఖలోనూ కొనసాగింపుగా ఉందని పార్టీలోని వర్గాలు అంటున్నాయి.
కేసీఆర్ సభలో బీజేపీపై ప్రత్యేక విమర్శలు చేయకపోవడంతో, భవిష్యత్తులో బీఆర్‌ఎస్ – బీజేపీ పొత్తుపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని ఇటీవల కవితనే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ లేఖ చుట్టూ జరిగిన రాజకీయ ప్రకంపనలపై బండి సంజయ్ తాజా ట్వీట్ మళ్లీ చర్చకు దారితీసింది.