bandi sanjay: మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగిన ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారంతే కాకుండా, దాన్ని ప్రశ్నించిన మహాన్యూస్ ఆఫీస్‌పై దాడులు చేయించాలా? ” అని బండి సంజయ్ నిలదీశారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలపై దాడి అని స్పష్టం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా, జర్నలిస్టు సంఘాలు ఈ దాడిని తక్షణమే ఖండించాలి అని పిలుపునిచ్చారు.
“ జర్నలిజం గురించి నీతులు చెబుతూ ట్విట్టర్‌లో వాఖ్యాలు చేసే టిల్లు నేతలు , మీడియాపై దాడులకు ప్రేరణ కల్పించడం దారుణం. అంతటి దురాగతానికి కూడా సిగ్గు లేకుండా వ్యవహరించడం తీవ్ర విచారకరం ,” అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
“బీఆర్‌ఎస్ పాపాల పుట్ట బద్దలవుతుండటంతో**, దాన్ని తట్టుకోలేకే మహా న్యూస్ ఆఫీసుపై దాడులకు తెగబడింది. ఇది భయపడే పార్టీ చిహ్నం. ప్రజలు అన్ని చూస్తున్నారు. వీరి ఆటలు ఎక్కువ కాలం సాగవు,” అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.