Balakrishna: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశంపై వాగ్వాదం చోటు చేసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా జరిగిన అవమానాలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేశంగా స్పందించారు.
మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, అప్పట్లో సినీ ప్రముఖులను కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, చిరంజీవి గట్టిగా అడగడం వల్లే ఆయన వారిని కలిశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడినందుకే జగన్ కలిశారన్నది పచ్చి అబద్ధం అని ఆయన అన్నారు. ఆ సమయంలో ఎవరూ గట్టిగా ప్రశ్నించలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆరోజు సినీ ప్రముఖులను అవమానించారనే విషయం వాస్తవమే అని అంగీకరించినప్పటికీ, ఎవరూ ధైర్యంగా నిలదీయలేదని పేర్కొన్నారు.
తాను కూడా ఆ సమావేశానికి ఆహ్వానం అందుకున్నప్పటికీ, హాజరు కాలేదని బాలకృష్ణ సభకు తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన జాబితాలో తన పేరు తొమ్మిదో స్థానంలో ముద్రించారని, దీనిపై తాను అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిని నిలదీశానని బాలకృష్ణ గుర్తు చేశారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వడానికే తాను మాట్లాడానని, ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని సభను కోరారు. ఈ అంశంపై బాలకృష్ణ, కామినేని మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.