Bajireddy Govardhan: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్‌కి కంచుకోట… అదే విధంగా అక్కడి నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్థన్ ఓటమి ఎరుగని నాయకుడిగా పేరుంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే పదవి వరకు బాజిరెడ్డి గోవర్ధన్ ఎదిగారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌పై గెలిచిన ఘనత బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఉంది.
అంచెలంచెలుగా ఎదిగి ఆర్టీసీ ఛైర్మన్ పదవి కూడా చేపట్టారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్…ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారన్నపేరు ఉంది. 1999లో ఆర్మూరు, 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక రాష్ట్ర విభజనకు ముందు బీఆర్ఎస్‌లో చేరిన ఈ నాయకుడు… 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కారు గుర్తుపై పోటీ చేసి… కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్‌పై 26 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.దీంతో ఆయన పేరు ఒక్కసారిగా రాష్ట్రామంతా మార్మోగిపోయింది.
Bajireddy Govardhan: అయితే బాజిరెడ్డి గోవర్థన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు భూపతిరెడ్డి… నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, డిచ్‌పల్లి ఇన్‌చార్జి ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జిగా భూపతిరెడ్డి పని చేశారు. అయితే 2014లో బాజిరెడ్డికి బీఆర్ఎస్ అధినేత టికెట్ ఇవ్వడంతో భూపతిరెడ్డికి అవకాశం లభించలేదు.
కానీ 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారాయన. ఒకే పార్టీలో ఉంటూ ఇరువురు నాయకులు గొడవ పడేవారు. బహిరంగ వేదికలపైనే ఈ నాయకులిద్దరు బాహాటంగా విమర్శలు చేసుకునే వారు. ఇద్దరి వ్యవహారం అప్పట్లో ఒకరకంగా పార్టీకి ఇబ్బందికరంగా ఉండేంది. ఎవరికి ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో బీఆర్‌ఎస్ అధిష్టానం సైలెంట్‌గా ఉండేది. అయితే బాజిరెడ్డితో పోరు భరించలేక మొత్తం మీద భూపతిరెడ్డి పార్టీని వీడారు. బాజిరెడ్డి పొమ్మనలేక పొగబెట్టినట్లు చేశారనే ప్రచారం జరిగింది. దీంతో 2018లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కొద్ది రోజులకే జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బాజిరెడ్డితో ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడి ఓడిపోయారు. అప్పటికే పార్టీని వీడిన కారణంగా భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ పదవిని కూడా కోల్పోయారు.
అయితే రెండోసారి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడం… స్థానికంగా బాజిరెడ్డి గెలవడంతో ఆయనతో బాహాటంగా కొట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. అయితే కొంత కాలం తర్వాత బాజిరెడ్డి గోవర్థన్‌కు తెలంగాణ ఆర్టీసి ఛైర్మన్ పదవి కట్టబెట్టారు నాటి సీఎం కేసీఆర్… దీంతో ఆయన నియోజకవర్గానికి కొంత దూరమవుతూ వచ్చారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడుకు బాజిరెడ్డి జగన్ రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు. తనయుడి జోక్యంతో పార్టీలోని చాలా మంది నాయకులు బాజిరెడ్డికి దూరమవుతూ భూపతిరెడ్డికి దగ్గరయ్యారు. మరోవైపు ఆర్టీసీ ఛైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యే బాజిరెడ్డి
Bajireddy Govardhan: ప్రవర్తనలోనూ మార్పు వచ్చినట్లు స్థానికంగా చర్చ కొనసాగింది. ఇవి సరిపోవన్నట్లు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తోడై మొత్తం మీద గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బాజిరెడ్డి ఓటమి చెందాల్సి వచ్చింది. ఐదేళ్ల పాటు సైలెంట్ రాజకీయాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయిన భూపతిరెడ్డి… 2023 సార్వత్రిక ఎన్నికల్లో బాజిరెడ్డిపై గెలవడం ద్వారా తనను పార్టీలో నుంచి వెళ్లిపోయేలా చేసిన నాయకునిపై రాజకీయ పగ తీర్చుకున్నారు.
అంచెలంచెలుగా ఎదిగిన బాజిరెడ్డి గోవర్థన్ రాజకీయ పలుకుబడి 2023నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా మసకబారిపోయినట్లు అయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. వాస్తవానికి నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్‌కి మంచి పట్టున్న జిల్లా. జిల్లా పరిషత్ ఛైర్మన్ సీటు, జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలను, ఎంపీ సీటును కూడా ఆ పార్టీ గతంలో కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత నిజామాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కవిత… 2019 ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే ఇటీవలి ఎన్నికల్లో ఆమె జైల్లో ఉండటంతో పార్టీ అధిష్టానం బాజిరెడ్డిని పోటీకి దింపింది. కానీ బాజిరెడ్డి కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. దీంతో ప్రస్తుతం బాజిరెడ్డి తన పాత నియోజకవర్గం బాన్సువాడ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆ నియోజకర్గానికి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట బాజిరెడ్డి గోవర్థన్. ఇక బాజిరెడ్డిని ఓడించిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు.