YCP virus attack Ganesh: ఏపీలో ఆ వైరస్ తాండవం చేస్తోందా? సాక్షాత్తూ వినాయకుడిని కూడా వదలని ఈ అరాచకం ఏంటి? గణేషుడి విగ్రహం వెనుక ‘రప్పా రప్పా’ డైలాగులు రాసి, గొడ్డలి గుర్తు వేసి రెచ్చిపోయారు వైసీపీ శ్రేణులు. ఈ సైకో సంస్కృతికి అడ్డుకట్ట వేసే నాయకత్వం ఆ పార్టీలో లేదా? లేక, కావాలనే ఈ అనాగరికతను వీధుల్లోకి వదిలారా? ఈ ‘రప్పా రప్పా’ వైరస్‌కి అసలు ఔషధమే లేదా? అన్న చర్చ జరుగుతోంది.
‘పుష్ప 2’ సినిమాలోని ‘రప్పా రప్పా’ డైలాగ్ జనం నోట వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఈ డైలాగును ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలోకి తీసుకొచ్చి, రాష్ట్రాన్ని రచ్చ రచ్చ చేస్తున్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ డైలాగ్‌ను తమ పేటెంట్‌గా మార్చుకుని, అన్ని చోట్ల రాజకీయ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ పదజాలాన్ని సమర్థిస్తూ, “చంద్రబాబు అరాచక పాలనే ఇలా మాట్లాడిస్తోంది” అంటూ వెనకేసుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులను సాకుగా చూపుతూ, తమ అనాగరిక వ్యాఖ్యలకు లైసెన్స్ తీసుకున్నట్లున్నారు వైసీపీ శ్రేణులు.
Also Read: Kavitha: కేటీఆర్, కేసీర్‌లకు హరీష్ రావ్‌తో ముప్పు.. సంచలన విషయాలు బయటపెట్టిన కవిత
ఈ రప్పా రప్పా హడావుడి చివరకు గణేషుడి నిమజ్జన ఉత్సవంలోకి కూడా చొచ్చుకెళ్లింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులో జరిగిన వినాయక నిమజ్జనంలో వైసీపీ శ్రేణులు విధ్వంసానికి తెరలేపాయి. గణనాథుడి విగ్రహం వెనుక ‘2.0 రప్పా రప్పా వైయస్సార్’ అని రాసి, ఎరుపు రంగు గొడ్డలి గుర్తు వేసి.. రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా, విగ్రహాన్ని గాల్లోకి ఎగురవేస్తూ కేరింతలు కొట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘పుష్ప’ సినిమాలో గంగమ్మ తల్లి జాతరలో తలనరుకుడు సన్నివేశాన్ని అనుకరిస్తూ… “వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అలానే నరుకుతాం” అన్నట్లు ఆ పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది, కానీ వైసీపీలో ఈ అనాగరిక సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత ఎవరిది? వరుస ఎన్నికల ఓటముల తర్వాత కూడా, “2029లో లెక్కలు తేల్చుతాం” అంటూ రెచ్చిపోతున్న ఈ శ్రేణులను అదుపు చేసే నాయకత్వం ఆ పార్టీలో లేనట్లే కనిపిస్తోంది. గణేషుడి ముందు రాజకీయ రౌడీయిజం చూపిన ఈ రప్పా ర్పా వైరస్‌కి అంతం ఎప్పుడో.. ఆ గణనాథుడే నిర్ణయించాలని వాపోతోంది సామాన్య ప్రజానీకం.