YCP leader in Mydukur: మైదుకూరు రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగుతోంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర భవిష్యత్తు రాజకీయ అడుగులు ఏవో అన్న అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. చంద్ర టీడీపీలో చేరతారన్న ప్రచారం బలంగా వినిపిస్తున్నా, ఆ నిర్ణయంపై స్థానికంగా విభేదాలు ఉత్పన్నమవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం సమయంలో టీడీపీ నేతలకు ఇబ్బందులు కలిగించిన వారిలో మాచనూరు చంద్ర కీలకంగా నిలిచారు. అప్పట్లో అక్రమ కేసులు పెట్టించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి ధనపాల జగన్‌కు గట్టి సవాల్‌గా నిలిచారు. చివరకు ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతోనే చంద్ర వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు.
Also Read: Ys Sharmila: రాష్ట్రంలో యూరియా కొరతపై షర్మిల ఫైర్ – కూటమి ప్రభుత్వమే కారణమా?
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన చంద్ర, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ రెడ్డితో ఒక కార్యక్రమంలో పాల్గొనడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిణామాన్ని స్థానికంగా టీడీపీ వర్గాల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే ముందే మాటా మాటా పెరగడంతో పరిస్థితి అసౌకర్యంగా మారింది. దీంతో చంద్రను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆయన వల్ల కలిగే రాజకీయ నష్టాలపై కూడా ఎమ్మెల్యే పుట్టా ఆలోచనలో పడ్డారని సమాచారం.
చంద్రను పార్టీలోకి తీసుకోవడం ద్వారా స్థానికంగా కొంత బలం చేకూరినా, గతంలో ఆయన వల్ల ఇబ్బందులు పడ్డ టీడీపీ శ్రేణులు మళ్లీ ఏకతాటిపైకి వస్తారా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అంతేకాదు, వైసీపీ నుంచి రాజీనామా చేసినప్పటికీ చంద్ర ఇంకా మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న అంశం కూడా పార్టీ కార్యకర్తల మధ్య చర్చనీయాంశమైంది. మైదుకూరు రాజకీయాల్లో మాచనూరు చంద్ర అడుగులు తదుపరి పరిణామాలను ప్రభావితం చేయనివ్వవు అనడం కష్టం. నిజంగా ఆయన టీడీపీలో చేరితే లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చంద్ర టీడీపీలో చేరుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.