Vivek vs Prem Sagar: కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వివేక్‌కు సొంత పార్టీలో, పైగా సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదు. ఆయన ఎన్నికల వరకు వేరే పార్టీలో కొనసాగి, ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన వచ్చీ రావడంతో తనకు, తన అన్న వినోద్‌కు కాంగ్రెస్ టిక్కెట్ సాధించుకున్నారు. అంతేకాకుండా, తన కొడుకు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టిక్కెట్ సంపాదించిపెట్టారు. ఇదంతా ఒక్క ఎత్తు కాగా, మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. అయితే, ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
తాను ఎన్నో ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్నానని, పార్టీ కోసం ఎంతో చేశానని, అలాంటిది.. తనని కాదని, అధిష్ఠానం మరొకరికి మంత్రి పదవిని కట్టబెట్టిందని తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పది రోజుల కిందట ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్, కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ప్రేమ్‌సాగర్ రావు అనుచరవర్గం వివేక్ అంటే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్‌సాగర్ రావు, ఆయన అనుచరవర్గం తమ నియోజకవర్గంలో అడ్డుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్‌కే అల్టిమేటం జారీ చేశారట. దీంతో ఎందుకైనా మంచిదని మంత్రి వివేక్ కూడా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఆయన జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో అడుగుపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి జిల్లాకు వచ్చినపుడు సైతం ఈ నియోజకవర్గానికి రాకుండా జాగ్రత్త పడ్డారట.
ఉపముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తే, సొంత జిల్లాకు చెందిన మంత్రి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయాలి. అది ప్రోటోకాల్. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో అది జరగలేదు. దీని వెనక ఉన్న మర్మం ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్గవిభేదాలు ఉన్నప్పటికీ, తూర్పు జిల్లాలో మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పార్టీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న గడ్డం వివేక్ వెంకటస్వామిని అవమానపరిచే స్థాయి దాకా ఈ విభేదాలు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సహా ముగ్గురు మంత్రులు ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో, జిల్లాకు చెందిన మంత్రి దగ్గరుండి ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత అన్నది ఆనవాయితీగా వస్తోంది. కానీ, నిన్న మంచిర్యాల నియోజకవర్గ పర్యటనలో ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఉపముఖ్యమంత్రి పర్యటనకు పూర్తి దూరంగా ఉన్నారు. అలా అని ఆయన ఎక్కడో లేరు. సొంత నియోజకవర్గంలో పొద్దున మార్నింగ్ వాక్ చేసి, నియోజకవర్గ ప్రజలతో ఉన్నారు. రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కానీ, ఉపముఖ్యమంత్రి కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండటం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Also Read: VPR minus YCP plus: రాజకీయం మిస్ అవుతున్న వీపీఆర్ కపుల్..
Vivek vs Prem Sagar: మంత్రివర్గ విస్తరణ సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. చివరి క్షణంలో ఆయనకు పదవి దక్కకుండా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి దక్కించుకున్నాడు. అప్పటినుంచి ప్రేమ్‌సాగర్ రావు తీవ్ర అగ్రహంతో ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి అని ఆయన స్వయంగా ప్రకటించారు కూడా. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. ప్రేమ్‌సాగర్ రావు పెత్తనం చెలాయించడం వల్లనే మంత్రి వివేక్ ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఉపముఖ్యమంత్రి పర్యటనకు ఆయన దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రేమ్‌సాగర్ రావుకు మంచిర్యాలతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో పట్టు ఉంది. దీని కారణంగా పార్టీ అధిష్ఠానం కూడా కొంత వెనక్కి తగ్గే వైఖరి అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పరిస్థితులు ఇలా ఉంటే, రానున్న పంచాయతీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం ప్రతిసారీ అందరూ కలిసి పనిచేయాలని చెబుతున్నప్పటికీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా రాజకీయాలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నాయని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి, మంత్రి వివేక్ ఆ నియోజకవర్గంలో అడుగుపెడతారా? ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటారా? వేచి చూడాల్సిందే.