TTD Prakshalana: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీలో అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టీటీడీలోని అనేక విభాగాలపై విచారణ జరిగింది. ఈ సమయంలోనే టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యి కల్తీ ఇష్యూ బయటకు రావడంతో, దానిపై రాష్ట్రం సిట్ ఏర్పాటు చేయడం, తర్వాత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీబీఐ నిర్వహణలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందులో ఏఆర్ డైరీతో పాటు బొలేరాబా డైరీ, వైష్ణవి డైరీ నిర్వాహకులు అంతా కేసులో ఉన్నారు. ఇందులో ఉద్యోగులు కూడా అవినీతికి పాల్పడినట్లు సీబీఐ సిట్ నిర్ధారించింది. ఇందులో కొంతమంది అప్రూవర్‌గా మారినట్లు కూడా తెలుస్తోంది. అయితే, అవినీతికి పాల్పడిన ఉద్యోగుల వివరాలు టీటీడీ ఉన్నతాధికారులకు తెలిపినా, వారిపై చర్యలేవి?
టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అత్యంత అవినీతిమయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. సీనియర్‌లను కాదని గతంలో పనిచేసిన ఎస్‌ఈకి ప్రమోషన్ ఇప్పించి, తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు అప్పటి పాలకులు. గత ప్రభుత్వంలో ఇద్దరు చైర్మన్‌ల పదవీ కాలంలో అనేక అక్రమ దందాలు నడిచినట్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఏకంగా ఇంజనీరింగ్ పనుల విషయంలో స్విమ్స్ నిర్మాణాలు, పద్మావతి నూతన ఆసుపత్రి పనులతో పాటు గోవిందరాజ సత్రాల కూల్చివేత పనులపై కూడా విచారణ చేసిన విజిలెన్స్, అనేక అక్రమ దందాలు నడిచినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ ప్రమోషన్‌లతో పాటు అర్హత లేని వారికి ప్రమోషన్‌లు ఇచ్చినట్లు నిర్ధారించింది. అయినా ఏమైనా చర్యలున్నాయా?
అయిన వారి ఆకుల్లో కాని వారికి బోకుల్లో అన్నట్లు నడిచింది వ్యవహారం. అర్హత లేని వ్యక్తిని తెచ్చి టెక్నికల్ విభాగం హెడ్‌గా నియమించారు. దీంతో పాటు మెకానికల్ విభాగాధిపతిని టెక్నికల్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. వాహనాల కొనుగోలుతో పాటు అద్దె వాహనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు, ఇందులో కూడా అవినీతి జరిగినట్లు నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపైనా ఎలాంటి చర్యలు లేవు. దీంతోపాటు డైరీ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ హారినాథ్ రెడ్డి పాత్రపై కూడా నివేదిక ఇచ్చినా, అతను సస్పెండ్ అయిన తర్వాత కూడా వివరాలు టీటీడీ బయటపెట్టలేని స్థితిలో ఉందని, వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి.
Also Read: Open AI: న్యూఢిల్లీలో OpenAI తొలి కార్యాలయం.. త్వరలోనే ప్రారంభం..!
మొత్తంగా ప్రక్షాళన అంటూ సీఎం ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదన్న మాట టీటీడీలో వినిపిస్తోంది. ఐదారు సంవత్సరాలుగా పాతుకుపోయిన సిబ్బంది కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. వీరు గత పాలకుల ఆదేశాలను ఇక్కడ అమలు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎస్టేట్ విభాగాల్లో ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుందని అంటున్నారు. యాభై మంది తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదికలో పేర్కొనగా, ఎక్కువ శాతం మంది ఎస్టేట్‌తోపాటు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు, మార్కెటింగ్ విభాగంలో జీడి పప్పు లాంటి దినుసుల కొనుగోలులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేని సరుకులు కొనుగోలు చేసి, వాటికి పూర్తి ధర చెల్లించి జేబులు నింపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఎస్టేట్ విభాగంలో హోటల్స్ టెండర్లతోపాటు షాపులు, తట్టల దందా పెద్ద ఎత్తున నడిచింది. దళారులను పెట్టుకొని వసూళ్ల కార్యక్రమాలు జరిగాయని కూడా విజిలెన్స్ సాక్ష్యాలతో సహా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాంటి చర్యలు లేవు సరికదా… ఇప్పటికీ అప్పట్లో పనిచేసిన సిబ్బందిని పెట్టుకొని, గతం నుంచి కొనసాగుతున్న ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నాడని తెలుస్తోంది.
తన కోవర్ట్‌లు టీటీడీలో ఉన్నారని, వారి ద్వారా పిన్ టు పిన్ తనకు తెలుస్తుందని గత చైర్మన్ బహిరంగంగా చెప్పినప్పటికీ, ప్రస్తుత పాలకులు మాత్రం ఎవరు వారన్న రీతిలో కనీసం చిన్న శోధన కూడా చేయలేని స్థితిలో ఉన్నారన్న మాట వినబడుతోంది. ముఖ్యంగా, విజిలెన్స్ నివేదికలో పొందుపర్చిన 50 మందిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఫలితం ఉండేది. భయంతో పనిచేసేవారు. దీనికితోడు, గత పాలకులు చేసిన అతిపెద్ద తప్పిదం పరకామణి కేసులో పోరాటం చేస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డికి సహకరించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో టీటీడీలో తప్పిదాలు జరిగాయని ప్రజలు గట్టిగా విశ్వసించారు. కానీ, ప్రస్తుత పాలకులకు ఆధారాలతో సహా విజిలెన్స్ నివేదికలున్నా, చర్యలు తీసుకోలేకపోవడానికి కారణమేమిటి? గతం నుంచి కొనసాగుతున్న వారికి గాడ్‌ఫాదర్‌లు ఎవరు? వారు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పాత్రధారులుగా ఉన్నారా? అసలేం జరుగుతోంది? టీటీడీ ప్రక్షాళన ఇంకా పూర్తి కాలేదా? అక్రమార్కుల దందాలు ఇంకా కొనసాగుతాయా? వారు అడిగినట్టు పాడినట్టు ఉంటుందా? ఇన్ని తప్పులు చేసిన వైసీపీ నేతలు టీటీడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీటీడీలో కొనసాగుతున్న అవినీతి అధికారులపై ఎందుకు ఉన్నతాధికారులు వెనకాడుతున్నారో ఆ శ్రీనివాసుడికే అర్థమవ్వాలి.