Pawan Kalyan Konidela

Pawan Kalyan Konidela: ఇంటిపేరు నిలబెట్టిన కొణిదెల పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan Konidela: ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉంది. కొణిదెల అనగానే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కుటుంబాల ఇంటి పేరని ఇట్టే గుర్తొస్తుంది. ఇప్పుడా గ్రామం పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామ అభివృద్ధికి ఆయన తన సొంత నిధులు కేటాయించడంతో ఇప్పుడా గ్రామం రూపురేఖలు మారబోతున్నాయి. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొణిదెల గ్రామంలో సుమారు 6 వేల జనాభా ఉంది. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా కొణిదెల పేరుతో ఓ గ్రామం ఉందని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తన ఇంటిపేరు ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామానికి సొంత నిధులు మంజూరు చేశారు. గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని 50 లక్షల రూపాయలు ఇచ్చారు. దీంతో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య… ఇచ్చిన నిధులను గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంక్ కోసం భూమి పూజ చేశారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Also Read: PM Modi: ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్‌ టొబాగో అత్యున్నత పురస్కారం

Pawan Kalyan Konidela: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కొణిదెల గ్రామానికి నిధులు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందికొట్కూరుకు చెందిన చిత్రకారుడు దేశెట్టి శ్రీనివాసులు అక్షరాల రూపంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. ఇచ్చిన మాటను నెరవేర్చిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను రాజకీయ నాయకులు తప్పడం కామన్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు.

మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం పేరు ఇప్పుడు అభివృద్ధి చెందడంతో పాటు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *