PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం లభించింది. కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’ను మోదీకి అందజేసింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగాలో చేతుల మీదుగా ప్రధాని మోదీ ఈ అరుదైన సత్కారాన్ని అందుకున్నారు. ఇది విదేశీ దేశం నుండి ప్రధాని మోదీకి లభించిన 25వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. గతంలో రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు కూడా మోదీకి తమ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి.
పురస్కారం అందుకున్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నానని తెలిపారు. ఈ పురస్కారం భారత్-ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను, ప్రపంచ వేదికపై భారతదేశం పోషిస్తున్న చురుకైన పాత్రను, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. 180 సంవత్సరాల క్రితం భారత్ నుండి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వలస వచ్చిన ప్రజలే ఈ స్నేహబంధానికి పునాది వేశారని మోదీ గుర్తుచేశారు.
Also Read: Texas Floods: అమెరికాలో భారీ వరదలు.. 24 మంది మృత్యువాత
ట్రినిడాడ్ అండ్ టొబాగో పురస్కారంతో పాటు, ఇటీవల పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా కూడా ప్రధాని మోదీని తమ అత్యున్నత పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనా రాజధాని ఆక్రాలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ ఈ అవార్డును మోదీకి అందజేశారు. ఈ అంతర్జాతీయ గౌరవాలు భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధాని మోదీ యొక్క నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న గుర్తింపును చాటిచెబుతున్నాయి.