KTR: రైతు సంక్షేమంపై ఎవరు ఏమి చేశారో? తేల్చుకునేందుకు చర్చిద్దాం.. మేము రెడీ.. మీరూ సిద్ధం కండి.. జూలై 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మేము వస్తాం.. మీరూ రండి.. లేదంటే 72 గంటల టైం ఇస్తున్నాం.. ప్రిపేరై రండి.. డేటు, టైం సీఎం రేవంత్ ఇష్టం.. మేము ఎప్పుడైనా రెడీ.. అని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనైనా చర్చించేందుకు తాము సిద్ధమేనని కేటీఆర్ ప్రకటించారు.
KTR: పదేళ్లు రైతు కేంద్రంగా బీఆర్ఎస్, కేసీఆర్ పాలన సాగించారని కేటీఆర్ తెలిపారు. రైతులకు ఎవరు ఏం చేశారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. నాటి పదేండ్లలో రైతులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారని తెలిపారు. నాడు 11 సార్లు రైతుబంధు వేసి రైతులకు సకాలంలో అవసరాలను తీర్చామని తెలిపారు. 30 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులకు ఆసరాగా నిలిచామని వివరించారు.
KTR: కేసీఆర్ సీఎంగా రైతులకు ఉచిత బీమాను పకడ్బందీగా అమలు చేశారని కేటీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. నాడు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడకుండా ప్రజల అవసరాలు తీర్చామని వివరించారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డి తన సభల్లో బూతులు, రంకెలు వేయడం సర్వసాధారణం అయిందని కేటీఆర్ విమర్శించారు. ఆంధ్రా చర్యలకు రేవంత్ వంతపాడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఎరువులు ఇవ్వడానికే చేతకావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతుబంధును నాలుగు సార్లు ఎగ్గొట్టిందని ఆరోపించారు. గోదావరి నీళ్లను ఆంధ్రాకు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
KTR: రైతురాజ్యాన్ని ఎవరు తెచ్చారో చిన్నపిల్లాడిని అడిగినా తెలుస్తుందని తెలిపారు. ఇందిరమ్మ పాలనలో చెరువులు ఎండిపోతే.. ప్రత్యేక తెలంగాణ వచ్చాక కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం చేపట్టి సాగు, తాగునీటి ఇక్కట్లను తీర్చారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మత్స్య సంపదను పెంచి మత్స్యకారులను ఆదుకున్నారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి రైతులకు రైతుబంధు వెయ్యడని కేటీఆర్ చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలకు వేస్తానని అన్నాడు, ఎవరికైనా పడ్డాయా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే ఇటీవల రైతుభరోసా డబ్బులు వేశాడని తెలిపారు. నాలుగు పంటలు కలిపి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగ్గొట్టాడని కేటీఆర్ ఆరోపించారు. నాడు కేసీఆర్ రైతులు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు వేస్తే, నేడు రేవంత్‌రెడ్డి ఓట్లు వేసేటప్పుడే రైతుభరోసా వేస్తున్నాడని ఆరోపించారు.