Pawan kalyan: అడవి తల్లే నాకు గుణమునిచ్చింది.. ఆపదొస్తే నేను గణమునవుతాను’ – ఈ మాటలు ‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తాయి. అడవి బిడ్డల ఆపదల్లో అండగా నిలిచే ‘కొక్కిలి దేవర’గా ఆ సినిమాలో పవన్ కనిపిస్తే, నిజ జీవితంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన గిరిజనుల కోసం అదే ఆపద్బాంధవ్యాన్ని చూపిస్తున్నారు. సినిమాలో గిరిజనుల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ హీరో, రాష్ట్రంలో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగు నింపే యోధుడిగా మారారు.
దశాబ్దాలుగా గిరిజన గూడేల్లో డోలీ మోతలు, మృత్యు రోదనలు, నిండు గర్భిణీల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. అభివృద్ధి జెండా ఎగురవేసిన పట్టణాలకు దూరంగా… అడవి ఒడిలో జీవన యుద్ధం చేస్తున్న గిరిపుత్రులకు ‘రోడ్డు’ అనే పదం కలగానే మిగిలింది. అనారోగ్యం వచ్చినా, ప్రసవ వేదన మొదలైనా, ఆసుపత్రిని చేరాలంటే డోలీలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాలి. కానీ, ఈ చీకటి రాత్రులకు తెరదించే ఉషోదయ సూర్యుడిలా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జనసేన అధినేతగా, డిప్యూటీ సీఎంగా ఆయన చూపిన చొరవ గిరిజన గూడేల్లో కొత్త ఆశల్ని మొలకెత్తిస్తోంది.
‘అడవి తల్లి బాట’ అనే పేరుతో పవన్ ఒక సంకల్ప యాత్రను ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆయన, గిరిజన గ్రామాలను కాలినడకనే సందర్శించారు. డుంబ్రిగూడ మండలం పెదపాడు గూడెంలో బహిరంగ సభలో మాట్లాడిన పవన్, ‘‘అడవి తల్లి మనకు బువ్వ పెడుతుంది, నీడ ఇస్తుంది. ఆమె బిడ్డల జీవనం మెరుగవ్వాలి’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. రోడ్లకు, నాగరికతకు ఆమడ దూరంలో ఉండే ఈ గూడేలకు.. దారి చూపే ఈ గొప్ప ప్రయత్నం… డోలీ కష్టాల నుంచి గిరిజనులకు విముక్తిని కలిగిస్తుందని మాత్రం చెప్పొచ్చు.
Also Read: Andhra Pradesh: డే1 నుంచే అభివృద్ధి.. 10 నెలల్లో నెం.2
Pawan Kalyan: పవన్ ముందడుగుతో గిరిజన జీవితాలు నాగరికత వైపు పయనించనున్నాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి, కేవలం 24 గంటల్లోనే 49 కోట్ల నిధులను ఇందుకోసం సమకూర్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన గూడేల్లో రోడ్డు సదుపాయం కల్పించేందుకు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.92 కోట్లే కాగా, కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.1,500 కోట్ల పనులు మంజూరు చేసిందన్నారు. ‘‘ఓట్లు వేసినా, వేయకపోయినా మీ బాగోగులు చూస్తాం’’ అని పవన్ చెప్పిన మాటలు గిరిజనుల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. నాలి నడకన గిరిశిఖర గ్రామానికి చేరుకుని, అక్కడివారి సాదక బాధకాలన్నింటినీ ఆసాంతం విన్న డిప్యూటీ సీఎం.. ఆరు నెలల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న చర్యలతో గిరిజన గూడేల రూపురేఖలు మారనున్నాయి. గిరిజన గూడేలన్నీ లింకు రోడ్ల ద్వారా ప్రధాన రహదారులకు అనుసంధానమై, డోలీ మోతలు ఆగి, రయ్‌నా వాహనాలు తిరిగే రోజు దగ్గరపడింది. అడవి తల్లి ఒడిలో వెలుగులు నింపుతూ, గిరిజన బిడ్డల కలలకు రెక్కలు తొడిగిన ఏకైక నాయకుడిగా పవన్ చరిత్రలో నిలిచిపోతారంటున్నారు రాజకీయ పరిశీలకులు.