MVV Future in YCP: ఎంవీవీ సత్యనారాయణ విశాఖ మాజీ ఎంపీ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో చక్రం తిప్పారాయన. అధికారంలో ఉన్నప్పుడు తన సొంత వ్యాపారాల్ని బాగా విస్తరించి.. కోట్లకు కోట్లుసంపాదించారని టాక్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా లబ్ధి పొందిన ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎంపీగా ఉన్నప్పుడు లోకల్ ఇష్యూస్‌ని పూర్తిగా విస్మరించడమేనట. ఎంపీగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని కనీసం పట్టించుకోకపోవడం, విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం.. ఇలా చాలానే ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ తూర్పు నియోజకవర్గానికి సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఆ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు, కార్యకర్తలని పట్టించుకోవడం లేదు, కనీసం జగన్ విశాఖ వచ్చినప్పుడు కలవకపోవడంతో.. ఆయన వైసీపీలో ఉన్నారా లేరా అని క్యాడర్ చర్చించుకుంటున్నారు.
రాజకీయ నాయకుడు కంటే ఒక వ్యాపారస్తుడిగా విశాఖ వాసులకు సుపరిచితుడైన ఎంవీవీ సత్యనారాయణ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగా ఉండేది. ద్వితీయ స్థాయి నాయకుల్ని పట్టించుకోకపోవడం, తనకంటూ సొంత క్యాడర్ లేకపోవడం, రాజకీయం కంటే వ్యాపారానికి ఎక్కువ విలువ ఇవ్వడంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందని పొలిటికల్ సర్కిల్లో టాక్. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ మాజీ ఎంపీకి కొత్త చిక్కులు వచ్చాయి. గతంలో ఆయన చేపట్టిన ప్రాజెక్టులు నత్త నడకన సాగడం, దీనికి తోడు గతంలో చేసిన కొన్ని ప్రాజెక్టులపై తీవ్ర ఆరోపణలు రావడంతో వివిధ కేసులు వెంటాడుతున్నాయి. ఆ మధ్య ఈ మాజీ ఎంపీ ఇల్లు ఆఫీసులపై ఈడీ దాడులు చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ చర్యతో అప్పటివరకు చక్రం తిప్పిన ఈ మాజీ ఎంపీ.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వీటి నుంచి బయటపడడానికి కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి వర్కౌట్ కాలేదట. దీంతో ఏమీ చేయలేక.. తన మకాంని పక్క రాష్ట్రాలకు మార్చేసారట మాజీ ఎంపీ ఎంవీవీ.
Also Read: Laddu gang issue: లడ్డు గ్యాంగ్‌తో వైసీపీకి సంబంధం? పోలీసులతో సున్నం!
వాస్తవానికి విశాఖ తూర్పులో వైసీపీకి మంచి నేతలు ఉండేవారు. అందులో ఇప్పటి జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, మాజీ వీఎంఆర్‌డీఏ చైర్మన్ విజయనిర్మల వంటి నేతలందరూ… ఈ మాజీ ఎంపీ వ్యవహార శైలి నచ్చక… గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి వివిధ పార్టీల్లో జాయిన్ అయ్యారు. వీరితో పాటు ద్వితీయ స్థాయి నాయకులతో కూడా విభేదాలు ఉండడంతో ఆ ఫలితం మొన్న జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందంటారు. ఈ సమీకరణాలను పరిశీలించిన వైసీపీ అధిష్టానం ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా తొలగించి.. మొల్లి అప్పారావుకు ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ పరిణామంతో వైసీపీ.. ఎంవీవీని పొమ్మనలేక పొగ పెట్టిందంటూ పార్టీలో కార్యకర్తలు చర్చించుకుంటున్నారట.