Banakacharla Big Game: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేయాలి. గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించి, పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణా నది ద్వారా నంద్యాల జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించి, 7.5 లక్షల ఎకరాలను స్థిరీకరించాలి. తద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలి. ఇదీ క్లుప్తంగా బనకచర్ల ప్రాజెక్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు దశల్లో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాలా 80 వేల 112 కోట్లు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి మొదటిసారి వెల్లడించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్టు వివరాలను స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సిన బృహత్తర బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉండగా.. దానికి అదనంగా బనకచర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రతిపాదించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
నో డౌట్..! బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ వర ప్రదాయిని. చంద్రబాబు ఆలోచనల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశామలం అవుతుందనడంలో సందేహం లేదు. అందుకే చంద్రబాబు విజన్‌కి ఈ స్థాయిలో ప్రశంసలు. కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు విజన్, లక్ష్యంతో సమస్య లేదు. దానిని ఆచరణలో పెట్టేందుకు వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాల దగ్గరే పార్టీ క్యాడర్, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌కి సంబంధించిన నిపుణులు, ప్రజా సంఘాలు, మేధావులు సైతం ఒక్కటే అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. అందరి ఆందోళన, వ్యతిరేకత వెనుక కారణం ఆ ఒక్కరే. ఆ ఒక్కరు మరెవరో కాదు.. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులు డీల్ చేసిన మేఘా కంపెనీ, దాని అధినేత మేఘా కృష్ణారెడ్డి. అవును. మేఘాకు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు స్వయంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్. మేఘాకు, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల నేపథ్యంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Engineering Counselling: నేటి నుంచి ఎప్‌సెట్ కౌన్సెలింగ్..
Banakacharla Big Game: మేఘా చుట్టూ ఎన్నో వివాదాలు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఆ కెంపెనీ చేపట్టింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు మేఘా నిర్వాకమే అన్న ఆరోపణలున్నాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టును నవయుగ కంపెనీ నుండి లాక్కొని మరీ మేఘాకు ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. జగన్ హయాంలో మేఘా చేతిలో పోలవరం డయాఫ్రమ్ వాల్‌కి ఏ గతి పట్టిందో అంతా చూశారు. కాళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులే కాదు… మేఘా ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన అనేక ప్రాజెక్టులు వివాదాస్పదం అయ్యాయి. రీసెంట్‌గా మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. రూ.9 కోట్ల వరకు జరిమానా కూడా విధించింది. దీనికి కారణం కేరళలో నేషనల్ హైవే నిర్మాణ టెండర్ దక్కించుకున్న మేఘా అత్యంత నాసిరకంగా పనులు చేయడమే. ఇలా అనేక రాష్ట్రాల్లో మేఘా చేపట్టిన పలు ప్రాజెక్టులపై వివాదాలున్నాయి. కానీ బయటకు రావడం.. చర్చల్లో ఉండటం.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం దాదాపుగా ఉండదు.
ఇది ఇలా ఉంటే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పుడు ఆంధ్రాలోనూ కొంత మంది మేధావులు, రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ తీరుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. 80 వేల కోట్ల బనకచర్ల ప్రాజెక్టును ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ అసమర్థతను బయటపెట్టుకున్న‘మేఘా’కు ఎలా కట్టబెడతారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా… బనకచర్లను జగన్ మానసపుత్రికగా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి అంబికాదర్బార్ అగర్‌బత్తీలా ‘మేఘా’ కృష్ణారెడ్డి ఉన్నారని, ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును మేఘాకు కట్టబెట్టడానికి గతంలో జగన్ ప్రయత్నించారని, ఇప్పుడు మేఘాకే ప్రాజెక్టు వస్తుంది కాబట్టి జగన్ వ్యతిరేకించడం లేదని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర్రావు మాటల్లో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. బనకచర్ల విషయంలో టీడీపీ క్యాడర్ మాత్రం సంతృప్తిగా లేరు. టీడీపీ నేతలకు తెలిసిన పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. మేఘా కన్నా అద్భుతంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన కంపెనీలు ఉన్నాయి. కానీ చంద్రబాబును విజన్‌ను మేఘా చేతిలో పెట్టడాన్నే.. క్యాడర్ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.