Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా, రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రకటించింది. పెరిగిన డిమాండ్‌ను తీర్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం వేలాది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాన్ని అందిస్తోంది.
దేశంలోని 400 నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పూణె, లక్నో, కొచ్చి వంటి ప్రధాన నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టింగ్ కేంద్రాలు, లాస్ట్-మైల్ డెలివరీ స్టేషన్లలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అమెజాన్ తెలిపింది. ముఖ్యంగా, వేలాది మంది మహిళలతో పాటు 2,000 మందికి పైగా దివ్యాంగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఇప్పటికే అనేకమంది కొత్త సిబ్బంది విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా అమెజాన్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ మాట్లాడుతూ – “పండగ సీజన్ ముగిసిన తర్వాత కూడా అనేక మంది మాతో కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు మేము ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తాం” అని తెలిపారు.
ఉద్యోగుల సంక్షేమం కోసం సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా డెలివరీ సిబ్బంది విశ్రాంతి కోసం ‘ఆశ్రయ్’ రెస్ట్ సెంటర్లు 100కి పెంచినట్లు తెలిపింది. అదనంగా, 80,000 మంది డెలివరీ అసోసియేట్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు (కంటి, దంత, బీఎంఐ) అందిస్తోంది. అలాగే, ఉద్యోగుల ఆర్థిక సౌలభ్యం కోసం ‘ఎర్లీ యాక్సెస్ టు పే’ (EATP) సదుపాయం కల్పించింది. దీని ద్వారా ప్రతి నెల 20వ తేదీలోపు ఉద్యోగులు తమ జీతంలో 80% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.