Ajinkya Rahane: కూల్ గా కనిపించే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ గ్రౌండ్ లో మాత్రం అలా ఉండడని కివీస్ తో రెండో టెస్టుకు ముందు రివీల్ చేసాడు ..వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే. 2022 దులీప్ ట్రోఫీ సందర్భంగా జైస్వాల్ పై నిషేధం వేటు పడకుండా అతన్ని తప్పించిన విషయాన్ని రహానే గుర్తు చేసుకున్నాడు. హద్దులు దాటిన అతని స్లెడ్జింగ్ ను కంట్రోల్ చేసేందుకు మైదానం బయటకు పంపాల్సి వచ్చిన విషయాన్ని వివరించాడు రహానె.
2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ . సౌత్ జోన్ తో వెస్ట్ జోన్ తలపడిన ఈ మ్యాచ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే విషయం రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ మాత్రమే. తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క పరుగుకే ఔటైనా రెండో ఇన్నింగ్సులో 323 బంతుల్లో 265 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన అనూహ్య ఘటనను అప్పటి కెప్టెన్ అజింక్య రహానే వివరించాడు.
సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న .. యశస్వి జైశ్వాల్ పదేపదే సౌత్ జోన్ ఓపెనర్ రవితేజను స్లెడ్జింగ్ చేసినట్లు చెప్పాడు. ఒక దశలో ఇది హద్దులు దాటిందని ..మైదానంలో అంపైర్లు కలుగ జేసుకున్నా జైస్వాల్ తగ్గలేదని వివరించాడు. అప్పట్లో సౌత్ జోన్ కు విహారి సారథ్యం వహిస్తుండగా.. వెస్ట్ జోన్ కు రహానె కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సమయంలో రహానె ..జైస్వాల్ తో మాట్లాడి అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు పంపాడు.
Ajinkya Rahane: పుణెలో రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతనిని మైదానం నుండి బయటకు పంపకపోతే జైస్వాల్ తర్వాత నాలుగు మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యేవాడంటూ యశస్వి జైస్వాల్‌కు సంబంధించిన సంఘటనను అజింక్యా రహానె గుర్తు చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ ‘తెలియకుండా’ హద్దులు దాటాడని, అతని క్రికెట్ భవితవ్యం కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అతన్ని మైదానం బయటకు పంపకపోతే నిషేదం వేటు వేసేవాడినని రిఫరీ కూడా చెప్పారని వెల్లడించాడు. ఏడు ఓవర్ల ఆట తర్వాత జైస్వాల్ మళ్లీ మైదానంలోకి వచ్చినట్లు వివరించాడు. చివరకు 20 శాతం మ్యాచ్ ఫీజు కోతతో ఈ ఇన్సిడెంట్ నుంచి జైస్వాల్ బయటపడ్డాడు. ఈ మ్యాచ్ లో సౌత్ జోన్ పై వెస్ట్ జోన్ విజయం సాధించింది.