Road Accident: మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జహబువా జిల్లా మేఘ్‌నగర్ తెహసీల్ పరిధిలోని సంజేలి రైల్వే క్రాసింగ్ సమీపంలో వ్యాన్‌ను సిమెంట్‌తో లోడ్ చేసిన ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన గురువారం ఉదయం 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 11 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా, మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని జహబువా జిల్లా ఎస్పీ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు.
ప్రమాదం పై మళ్లీ దృష్టి:
ఈ ప్రమాదం మానవ జీవితాల విలువను మరోసారి గుర్తుచేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ, రాత్రివేళ ట్రక్కుల వేగం నియంత్రణపై ఉన్న బలహీనతలను ఈ ఘటన వెలికితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద సంఘటన పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సత్వర పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.