Bhumana Karunakar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆరోపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో, భూమన కరుణాకర్ రెడ్డి ఆ అధికారిణిని “అవినీతిలో అనకొండ లాంటి అధికారిణి” అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆమె తన పదవీ కాలంలో మంత్రులను కూడా లెక్క చేయకుండా, కేవలం డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. “ఏ నైతిక విలువలూ లేని మనిషి”, “కింది స్థాయి అధికారుల పట్ల తాటకిలా వ్యవహరించేవారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలు తిరుపతిలో జరిగిన టీడీఆర్ (Transferable Development Rights) బాండ్ల కుంభకోణానికి సంబంధించినవి. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్ల విస్తరణ కోసం స్థలాలను కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. అయితే ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భూమన ఆరోపిస్తున్నారు. దొంగ జీపీఏలు సృష్టించి, వివాదాస్పద భూములకు కూడా బాండ్లు ఇచ్చారని, నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు నగర మధ్యలో ఉన్న భూముల ధరలు నిర్ణయించి, వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
Also Read: DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దైవం: డీకే శివకుమార్, RSS గీతం వివాదంపై క్లారిటీ
టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు కొట్టేయాలని ఆ అధికారిణి ప్రయత్నిస్తే, తాము అడ్డుకున్నామని భూమన పేర్కొన్నారు. దానిని తట్టుకోలేక, ఆమె నెల్లూరు జిల్లా నేతల ద్వారా తమపై రూ.2000 కోట్లు దోచుకున్నారని తప్పుడు ప్రచారం చేయించారని ఆయన ఆరోపించారు. ఆమె 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా వందల, వేల కోట్లు దోచుకుందని, ఆమె అవినీతి గురించి అత్యున్నత న్యాయస్థానం కూడా వెటకారంగా వ్యాఖ్యానించిందని భూమన వెల్లడించారు. ఆమె ధరించే ఒక్క చీర ఖరీదు రూ.1.5 లక్షలు ఉంటుందని, అలాగే ఆమె వద్ద రూ.50 లక్షల విలువైన 11 విగ్గులు ఉన్నాయని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
తనపై వచ్చే ఆరోపణలకు తాను ఎప్పుడూ స్పందించనని, కానీ రెండు సంవత్సరాలుగా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నానని భూమన అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం భూమన చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలపై సదరు అధికారిణి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.