Kadapa Chetha Scam: కుళ్లిన చెత్తకన్నా ఘోరంగా అవినీతి కంపు కొడుతోంది కడప కార్పొరేషన్. ప్రజల ముక్కు పిండి వసూలు చేసిన చెత్త పన్నుల్లో కోట్లల్లో జరిగిన గోల్ మాల్ ఇది. చెత్త పన్ను అక్రమ వసూళ్లపై కమిషనర్ స్పీడ్ పెంచడంతో.. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో క్లాప్‌లో అడ్డుగోలు వసూళ్లు జరిగాయి. చెత్తలో కూడా మాఫియాకు తెరలేపింది వైసీపీ. అయితే ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరకుండానే గండి కొట్టారు వైసీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులు. చెత్తలోనూ కోట్లాది రూపాయల అక్రమ సంపద వేనకేసుకున్నారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ కడపలో క్లీన్‌గా వసూళ్లకు పాల్పడ్డారు వైసీపీ నేతలు, కార్పొరేషన్ అధికారులు. ఇలా కార్పొరేషన్ ఖజానాకు కన్నం వేసిన వారిలో వైసీపీ బడా నేతలు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 నుంచి ఈ చెత్త పన్నుల్లో జరిగిన అవినీతి ఎంత? అసలు ప్రజల వద్ద వసూలు చేసింది ఎంత? కార్పొరేషన్‌కు కట్టింది ఎంత? లెక్కలు తేల్చాలంటున్నారు కార్పొరేషన్ ప్రజలు. ప్రత్యేకాధికారిని నియమించి విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెత్త పన్నుల్లో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది.
Also Read: MLC Kavitha: ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తోంది ఉత్తిత్తి ధర్నానా..?
జనం వద్దని గగ్గోలు పెట్టినా గత వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఇళ్లకు 90 రూపాయలు, వాణిజ్య సముదాయలకు 200 రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేశారు. కడప కార్పొరేషన్ పరిధిలో 90 వేల గృహలకు నెలకు 81 లక్షలు, ఇక వాణిజ్య సముదాయలకు సరాసరిన 75 లక్షలు.. అంటే మొత్తం కోటిన్నర్ర ప్రతి నెలా వసూలు కావాల్సి ఉంది. తొలి రోజుల్లో మందకొడిగా వసూళ్లు జరిగినా… తర్వాత క్రమంగా వసూళ్ల సంఖ్య పెరిగిపోయింది. అయితే.. ప్రజల నుంచి వసూలైన ఈ కోట్లాది రూపాయల సొమ్ము కార్పొరేషన్ ఖజానాకు జమ కాకపోవడం గమనార్హం. కార్పొరేషన్లో రికార్డులు పరిశీలిస్తే.. అసలు చెత్త పన్ను టార్గెట్ ఎంత? వసూలు అయినది ఎంత? ఖజానాకు జమ చేసింది ఎంత? ఈ లెక్కల్లో చాలా తిరకాసు ఉన్నట్లు తెలుస్తోంది.
కూటమీ ప్రభుత్వం ఏర్పడ్డాక చెత్త పన్ను అక్రమంగా వసూలు చేసిన 8 మంది సిబ్బందిపై వేటు వేశారు కమిషనర్ మనోజ్ రెడ్డి. కమిషనర్ చేసిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటికొచ్చాయి. క్లాప్ ప్రోగ్రాం అమలు అయినప్పటి నుంచి తొలి ఏడాది 50 శాతం కలెక్షన్లు కార్పొరేషన్‌కు జమ చేస్తే… రాను రాను 27 శాతం మాత్రమే జమ చేసారు. ఎమ్హెచ్వోగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మరింత తగ్గిపోయింది. అంటే చెత్త పన్ను వసూళ్లు ఖజానాకు కట్టకుండా అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు తమ జేబులు నింపుకున్నారనమాట. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డి దీనిపై 7 టీమ్‌లతో విచారణ చేయిస్తున్నారు. అయితే… కమిషనర్ ఈ విచారణలో వేగం పెంచడమే కాకుండా… నిజానిజాలు బయటికి తేవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం, మంత్రి నారాయణ చొరవ తీసుకుని కడప క్లాప్ దోపిడీపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేయించాలన్న డిమాండ్ సైతం వినిపిస్తోంది.