Rahul Gandhi: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత దేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి ఎంతో కిరాతకమైనది. భార్య ముందు భర్తను కాల్చిచంపిన ఘోరం నేను నేరుగా బాధితులను కలసినప్పుడు అర్థమైంది” అని తెలిపారు. పహల్గాం ఘటనను అందరూ ఖండించారని గుర్తుచేశారు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రతిపక్షాలు పూర్తి సహకారం అందించాయని రాహుల్ తెలిపారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచాయి. ఆపరేషన్‌కు ముందు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లినందుకు గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. పహల్గాం దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఆపరేషన్ సిందూర్ ముగిసిన తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసిపోయింది. అర్ధరాత్రి 1.25కి కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలోనే మోడీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చింది. ఇది సైన్యం కాకుండా ప్రభుత్వ వైఫల్యం,” అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్‌కు ముందే పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారని, కాల్పులు ఆపాలని కేంద్రం కోరిందని ఆరోపించారు. “ఇది మోడీ ప్రభుత్వం పాకిస్థాన్‌కు లొంగిపోయినట్లు స్పష్టం చేస్తోంది. సైన్యం చేతులను ప్రభుత్వం కట్టేసింది,” అంటూ విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా, “ఈ విషయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ 29 సార్లు ‘యుద్ధం తానే ఆపినట్లు’ చెప్పారు. మోడీకి ధైర్యం ఉంటే ట్రంప్ చెప్పింది అబద్ధమని లోక్‌సభలో ప్రకటించాలి. ఇంద్రా గాంధీ ధైర్యానికి సగం అయినా మోడీకి ఉంటే, ఆయన ఈ అంశంపై బహిరంగంగా స్పందించేవారు,” అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.