Auto driver: ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు.
రైతులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు మూడు విడతల్లో రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. మొదటి విడతగా త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
పేదల అభివృద్ధే లక్ష్యం
మహిళలు, రైతులు, డ్రైవర్ల వంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు త్వరితగతిన అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అన్ని వర్గాలకూ మేలు చేకూర్చే విధంగా శాసన, కార్యనిర్వాహక చర్యలు చేపడతామని చెప్పారు.