Hyderabad : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైదరాబాద్ నగరంలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, షైఖ్‌పేట్ ప్రాంతాల్లోని అనేక సంస్థల కార్యాలయాలు, ప్రముఖుల నివాసాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేశారు.
ఈ దర్యాప్తులో భాగంగా భారతి సిమెంట్స్, రిసోర్స్ వన్, ట్రీగ్రిల్, కేసిరెడ్డి, చాణక్యకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సంస్థలు లిక్కర్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్లు సిట్ అనుమానం వ్యక్తం చేసింది.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఇటీవల మైసూరు వద్ద అరెస్టయ్యారు. ఆయన మీద గతంలోనే సిట్ విచారణ జరిపినప్పటికీ, అనేకమార్లు విచారణకు హాజరుకాలేదు. పలుమార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో బెయిల్ కొరినా వాటిని తిరస్కరించారు. చివరికి అధికారులు విశ్వసనీయ సమాచారంతో మైసూరులో అతన్ని అరెస్టు చేశారు.
అలానే ఈ కేసులో ప్రముఖులైన ఐటీ సలహాదారుడు రాజ్ కశిరెడ్డి, వ్యాపారవేత్త చాణక్య (అలియాస్ ప్రకాష్), అలాగే పలు షెల్ కంపెనీల మాదిరిగానే ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ, ఈబాట్ ఎనర్జీ, స్కూబీ ల్యాబ్స్ వంటి కంపెనీలపై కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఈ వ్యవహారంపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కూడా ₹3,200 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేసింది. మొత్తం 33 మందిపై ఈ కేసులో నమోదు చేశారు. వీరిలో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటివరకు సిట్ దర్యాప్తులో అనేక కీలక ఆధారాలు, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరిన్ని ఆధారాలతో పాటు సంబంధిత బ్యాంక్ లావాదేవీలు, షెల్ కంపెనీల బోగస్ లెక్కలు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ కేసు పునాది నుంచే వేస్తూ సిట్, ఈడీ సంయుక్తంగా విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో, త్వరలోనే మరిన్ని అరెస్టులు సంభవించే అవకాశం ఉంది.