Odisha: ఒడిశా రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పూరీ జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బాలంగా బైబారా ప్రాంతంలో శనివారం ఉదయం ఒక మైనర్ ప్లస్ 2 విద్యార్థినిపై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు.
ఈ దారుణం బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా చోటుచేసుకుంది. దుండగులు ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి నిప్పంటించగా, బాలిక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. బాలిక అరుపులు విన్న వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు మంటలను ఆర్పేసి, తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: CM Chandrababu: తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ దారుణాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ దాడిని ఖండించిన ఆమె, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక చికిత్సకు అవసరమైన పూర్తి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని కూడా ఆమె హామీ ఇచ్చారు.