Manakodur Politics: ఒకరేమో అధికార కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ. మరొకరేమో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. నియోజకవర్గం పేరు మానకొండూరు. ఎక్కడైనా రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య అభివృద్ధి కార్యక్రమాలపైనో, అవినీతి వ్యవహారాలపైనో పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిధి దాటి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు. అలాంటి విమర్శలే ఇప్పుడు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నడిపిస్తున్న సినిమా పేరే డర్టీ పిక్చర్.
సాధారణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఎక్కడైనా ఆరోపణలు, ప్రత్యారోపణలుంటాయి. కానీ మానకొండూరులో మాత్రం రాసలీలలపై కొత్త చర్చ నడుస్తోంది. ఒకరు మొదలుపెట్టిన సంస్కృతిని ఇంకొకరు హుందాగా ఖండించాల్సి ఉండగా, ఆయనా డర్టీ పాలిటిక్స్‌నే కొనసాగిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్య మొదలైన డర్టీ పాలిటిక్స్, నేడు వారి అనుచర సమూహాలకు అంటుకున్నాయి. ఇంకేముంది పదులు, వందల సంఖ్యలో రాసలీలపై ఏకంగా పోస్టర్లే వేసుకుంటున్నారు. మార్ఫింగ్స్ ఫొటోలతో సోషల్ మీడియాలో.. ఎవరెంత సరస శృంగార కామకేళీ రసికులో ఒకరినొకరు బహిరంగంగా దూషించుకుంటున్నారు. ఈ ఇద్దరి అనుచరుల సమూహాల మధ్య కూడా ఇప్పుడు అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడీ సంస్కృతి కరీంనగర్ జిల్లా మానకొండూరు దాటి రాష్ట్రమంతా చర్చకు తెరలేపే స్థాయికి చేరుకుంటోంది.
Also Read: IIM Calcutta: కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతులపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
Manakodur Politics: మానకొండూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కవ్వంపల్లి సత్యనారాయణ.. కమీషన్ల నారాయణుడు అయ్యాడంటూ… ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చాలాకాలంగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కవ్వంపల్లి క్యారెక్టర్‌పైనా కొన్ని ఆరోపణలు గుప్పించారు. ఇక అప్పట్నుంచీ రాజుకున్న ఈ లొల్లి రానురాను ఇంకా పెరుగుతూనే ఉంది. రాసలీలల అంశం రాజుకుంటూనే ఉంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ రసమయి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసనకు దిగితే, ప్రతిగా కాంగ్రెస్ నాయకులూ రోడ్లపైకి రావడంతో మానకొండూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నెల జూలై 12వ తేదీన రసమయి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం డిమాండ్ చేస్తూ గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు బైక్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కవ్వంపల్లికి సంబంధించి… కామలీలల కవ్వంపల్లి – అనే ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు ప్రతిగా రాసలీల రసమయి అంటూ కాంగ్రెస్ కూడా మరో పోస్టర్‌ను తయారుచేసి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఈ ఇద్దరు నేతల అనుచరులు తమ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించాల్సి ఉండగా, ఇంకా అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు పోస్టర్లు వేసుకుంటున్నారు.
ప్రస్తుత మానకొండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వతహాగా డాక్టర్. ఇక మాజీ ఎమ్మెల్యే రసమయి డాక్టరేట్ అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. వీరు వీళ్ల నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో తెలియదుగానీ, ఇదిగో… ఇలా ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ, అశ్లీలమైన పద్ధతుల్లో వాళ్ల అనుచరులు తయారుచేస్తున్న పోస్టర్స్‌తో టీజర్స్, ట్రైలర్స్ దాటి ఏకంగా డర్టీ పిక్చర్ లాంటి బూతు సినిమాలే చూపిస్తుండటంతో భిన్న రకాల చర్చలకు కారణమవుతున్నారు. రోల్ మాడల్స్‌గా ఉండాల్సినవాళ్లు కాస్తా… ఇలా తయారవ్వడంపై ఒకింత ప్రజల్లో ఏహ్య భావం కనిపిస్తోంది.