Telangana Local Body Elections:ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికల ప్రకటన త్వరలో వెలువడనున్నది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. జూన్ 23న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించి, ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అన్ని ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనున్నది.
Telangana Local Body Elections:జూన్ 23న జరిగే రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో స్థానిక ఎన్నికల అంశమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణపైనే కూలంకషంగా చర్చిస్తారని సమాచారాం. ముందుగా నిర్వహించే ఎన్నికలపై ఒక నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తర్వాతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వెళ్లాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ భావనగా కనిపిస్తున్నది.
Telangana Local Body Elections:ఇన్నిరోజులుగా స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధంలో ఉన్న రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా ఏడాదిన్నర కాలంలో రైతు భరోసాపై అంతగా ముందుకు సాగని ప్రభుత్వం.. వానకాలం రైతు భరోసా సాయం పంపిణీలో వేగంగా కదులుతున్నది. జూన్ 21నాటికి 9 ఎకరాల రైతుల వరకు నగదు సాయాన్ని ఖాతాల్లో జమచేసినట్టు వార్తలు అందాయి. 23న సోమవారం రోజున 10 ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో రైతుభరోసా సాయాన్ని వేసి ప్రక్రియను నిలిపివేసే అవకాశం ఉన్నది.
Telangana Local Body Elections:ముఖ్యంగా రైతు భరోసా పూర్తిస్థాయిలో వేసిన ప్రభుత్వం ఎన్నికల వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికూ ఊరూరా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసింది. దీంతో రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకంపైనే ఆశలతో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు వెళ్తున్నది. రాజీవ్ యువవికాసం వాయిదా పడటంతో దానిపై అంతగా ఆశలు లేవు. అందుకే రైతుభరోసాను వేగవంతంగా అమలు చేస్తున్నది.
Telangana Local Body Elections:ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై సందిగ్ధత నెలకొన్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికీ కాంగ్రెస్ చెప్తూ వస్తున్నది. అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం వద్ద బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం పెండింగ్‌లో ఉన్నది. ఇదే దశలో రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
Telangana Local Body Elections:బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం తేలకముందే ఎన్నికలకు వెళ్తే ఎలా అనుకుంటూ ఉన్న కాంగ్రెస్ సర్కార్.. ఎలాగోలా ఎన్నికలు నిర్వహించాలని సిద్ధమైంది. ఇప్పటికే ఆలస్యమైందని భావించిన ప్రభుత్వం పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేయాలనే ప్రతిపాదన ఉంచాలనే యోచనతోనే ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ప్రభుత్వం మదిలో ఏమున్నదో రేపే తెలియాల్సి ఉన్నది.