KTR: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన.. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ పేర్కొన్నారు.
KTR: పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతి, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడుగడుగునా ప్రశ్నిస్తున్నారనే ఆయనపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్‌రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్రలు అనేక నెలలుగా కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.
KTR: ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు.. బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని కేటీఆర్ స్పష్టంచేశారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నంచే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతున్నాడని తెలిపారు.
KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని, తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన కౌశిక్‌రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KTR: తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉన్నదని, తమపై, తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కోర్టుల్లో నిలబడే అవకాశం లేదని కేటీఆర్ చెప్పారు. ఎన్ని వందల కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలనపై, బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు.