Beerla Ilaiah: యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాసంలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గంధమల్ల రవి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిలయ్య యాదగిరిగుట్టలోని ఇంట్లో, పెెంట్ హౌస్ లో అద్దెకు ఉంటున్నారు. తాను నివాసం ఉంటున్న గదిలోనే రవి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
వివరాల్లోకి వెళ్తే:
గంధమల్ల రవి గత కొన్ని సంవత్సరాలుగా తన భార్యతో కలిసి ఎమ్మెల్యే ఇంట్లో పనులు చేస్తూ, అక్కడే అద్దెకు ఉంటున్నారు. అయితే, ఇటీవల ఎమ్మెల్యే రవిని మందలించినట్లు తెలుస్తోంది. దీని తర్వాత రవి రెండు రోజులు తన స్వగ్రామమైన సైదాపురంలోనే ఉన్నాడు. తిరిగి ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి ఉరి వేసుకుని చనిపోవడం అనేక సందేహాలకు దారితీసింది. గ్రామస్తులు సైతం, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే రవి తన సొంత ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు.. దర్యాప్తునకు హైలెవెల్ కమిటీ
Beerla Ilaiah: ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. రవి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. రాత్రికి రాత్రే మృతదేహాన్ని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, సీబీసీఐడీ అధికారులతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించిన తర్వాత ఎమ్మెల్యే అయిలయ్య స్వయంగా సందర్శించారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేపట్టి, మృతికి గల కారణాలను, అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.