Ek Niranjan: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన రెండో చిత్రం ‘ఏక్ నిరంజన్’. అంతకుముందు వీరిద్దరి కాంబోలో ‘బుజ్జిగాడు’ చిత్రం రూపొందింది. రెండు చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినా, నటునిగా ప్రభాస్ కు మంచి మార్కులే సంపాదించి పెట్టాయి. 2009 అక్టోబర్ 29న విడుదలైన ‘ఏక్ నిరంజన్’ చిత్రం యూత్ ను మొదట్లో ఆకట్టుకుంది. ఇందులో కంగనా రనౌత్ నాయికగా నటించింది. చిన్నప్పుడే ఓ దొంగ కారణంగా కన్నవారికి దూరమవుతాడు హీరో. తరువాత నేరస్థులను పట్టించడంలో పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు. తన కన్నవారు పక్కనే ఉన్నా తెలుసుకోలేని పరిస్థితి హీరోది. గ్యాంగ్ స్టర్స్ ను ఎదుర్కొంటూ తన ప్రేయసిని దక్కించుకోవడం ‘ఏక్ నిరంజన్’ కథ. ఆదిత్య రామ్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా, రామజోగయ్య, భాస్కరభట్ల, విశ్వ – పాటలు పలికించారు. పదిహేనేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందు నిలచిన ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఓ ఫేవరెట్ మూవీ అని చెప్పవచ్చు.
