Vishaka YCP Raju Evaru

Vishaka YCP Raju Evaru: జైలు కెళ్తాడని తెలిసినా..! విశాఖలో వైసీపీ దుస్థితి..

Vishaka YCP Raju Evaru : 2019 నుంచి 24 వరకు ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖ జిల్లాలో చక్రం తిప్పిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో విశాఖ జిల్లాలో వైసీపీ ఘోర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకపక్క బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత విశాఖ వేదికగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ.. అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదనేది పార్టీలో జరుగుతోన్న చర్చ. నిత్యం ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న బొత్స కేవలం మీడియాకే పరిమితం అయ్యారనీ పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. బొత్స నాయకత్వాన్ని పార్టీలో ఒక వర్గం సమర్థిస్తుంటే మరో వర్గం వ్యతిరేకిస్తుందంట. అయినప్పటికీ బొత్స తన మార్కు రాజకీయాలతో పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారట.

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమి తర్వాత గుడివాడ అమర్నాథ్‌ను విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. గత పది నెలలుగా అమర్నాథ్ ప్రెస్మీట్లు తప్ప పార్టీకి చేసింది శూన్యం అంటూ కింద స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారట. ఆయన నాయకత్వంలో ఇటీవల జరిగిన జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో మేయర్ హరి వెంకట కుమారి పదవీచ్యురాలయ్యారు. ఇలాంటి తరుణంలో గుడివాడ అమర్నాథ్‌ను పార్టీ అధిష్టానం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్లేస్ మార్చింది. ఆయన స్థానంలో ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ కేకే రాజును విశాఖ జిల్లా అధ్యక్షుడుగా నియమించింది.

కేకే రాజు జగన్‌కు అత్యంత ఆప్తుడిగా జిల్లాలో పేరుపొందారు. 2019లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేకే రాజు.. తన సమీప ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమిపాలయ్యారు. కానీ వైసీపీ పార్టీ అధికారం రావడం, ఆ ఐదేళ్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సైలెంట్ కావడంతో కేకే రాజు విశాఖ నార్త్‌లో చక్రం తిప్పారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ప్రత్యర్థి బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. 2019 నుంచి 2024 వరకు అధికార బలంతో అడ్డు అదుపు లేకుండా భారీగా సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు మూట కట్టుకున్నారు కేకే రాజు. గత ఐదేళ్లలో ఒక ప్రైవేటు సైన్యాన్నే ఏర్పాటు చేసుకుని, రౌడీ బ్యాచ్‌ను ఎంకరేజ్ చేశారన్న ఆరోపణ కూడా ఉంది. రెండు సార్లు పోటీ చేసి ఓటమిపాలైన వ్యక్తికి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని పార్టీలో సీనియర్లు చర్చించుకుంటున్నారట. జగన్‌తో సాన్నిహిత్యం, బొత్సతో సత్సంబంధాలే కేకే రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వడంలో దోహదపడ్డాయని టాక్.

ALSO READ  NDL TDP President: నంద్యాల జిల్లా అధ్యక్ష రేస్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌

Also Read: Gorantla Madhav: మరో 2 వారాలు జైల్లో పడేయండి: కోర్టు

Vishaka YCP Raju Evaru : చంద్రబాబు పేరు వింటేనే ఒంటి కాలిపై లేసే కేకే రాజు… ముందు నుంచి టిడిపిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును 2020 ఫిబ్రవరి 27న విశాఖ విమానాశ్రయంలో కేకే రాజు ఆధ్వర్యంలో రౌడీ మూకలు అడ్డుకున్నాయి. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం కూడా. అప్పటి ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై రెండు కేసులు కూడా నమోదు చేసినప్పటికీ ఈ దాడికి నేతృత్వం వహించిన కేకే రాజు, ఆయన అనుచరులను నిందితులుగా చేర్చలేదు.

వైసీపీ అధికారంలో ఉండడంతో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. అప్పట్లో విశాఖ నార్త్ ఇంచార్జ్‌గా ఉన్న కేకే రాజు.. రౌడీ మూకలతో కలిసి చంద్రబాబు కాన్వాయ్‌ని ఆపి దాడికి యత్నించడంపై ఇంతవరకూ చర్యలు తీసుకోక పోవడంపై టీడీపీలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే కేకే రాజు అండ్ టీంపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో రాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే.. పార్టీ ఎలా ముందు సాగుతుందంటూ వైసీపీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఇలా అయితే విశాఖ జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితి తప్పదని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *