NDL TDP President: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే జిల్లా అధ్యక్ష పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలలో పలుకుబడి ఉన్న పోస్టు కావడంతో నాయకులు చాలా మంది పోటీ పడుతున్నారు. ఇక నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పోస్టు కోసం ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ నెలకొంది. నంద్యాల జిల్లాగా మారిన తర్వాత మొదటగా సీనియర్ నాయకులు గౌరు వెంకట్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. అనంతరం కొన్ని సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీ నేత జెడ్పీ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌ను నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. మల్లెల రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడిగా మొన్నటి ఎన్నికలకు నేతృత్వం వహించి జిల్లాలో 7 స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని సైతం గెలిచి టీడీపీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత నారా లోకేష్‌కు మరింత దగ్గరయ్యారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గత వైసీపీ పాలనలో అనేక దౌర్జన్యాలను ఎదుర్కొని పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం ఆయనకు టీటీడీ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించింది. పార్టీలో ఒక వ్యక్తి రెండు పదవుల్లో ఉండకూడదనే నిబంధనతో ఇపుడు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ వచ్చి పడింది.
నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పోటీ కోసం ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు సెగ్మెంట్‌లో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో రెడ్డి, మైనార్టీ, బలిజ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని సమాచారం. అయితే ఇప్పటికే పార్టీ జిల్లా నాయకత్వం కోసం కొన్ని పేర్లు సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో పాటు, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ – డోన్ నియోజకవర్గ ఇంచార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, మైనార్టీ వర్గానికి చెందిన ఎన్ఎండీ ఫిరోజ్, బలిజ సామాజిక వర్గానికి చెందిన గోగిశెట్టి నరసింహారావుతో పాటూ మరి కొంతమంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి మొన్నటి ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చారు. కోట్ల గెలుపు కోసం ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి కృషి చేశారు. అందుకు ప్రతిఫలంగా టీడీపీ అధిష్ఠానం ధర్మవరం సుబ్బారెడ్డికి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. జిల్లాలో అందరితో సాన్నిహిత్యం ఉండటంతో సుబ్బారెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి రావొచ్చు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇటు మైనార్టీ వర్గానికి చెందిన ఎన్ఎండీ ఫిరోజ్ ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు కార్యదర్శిగా ఉన్నారు.
Also Read: Gudivada Amarnath: గుడివాడ అమర్నాథ్ వైసీపీని వీడతారా?
NDL TDP President: ఫిరోజ్ మంత్రి ఫరూక్ కుమారుడు కావడంతో జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. జిల్లాలో మైనార్టీలు కూడా ఎక్కువగా నేపథ్యంలో తమ వర్గానికే జిల్లా అధ్యక్ష పదవి వస్తుందని ఫిరోజ్ అభిమానులు అంటున్నారు. ఇక బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ లాయర్ గోగిశెట్టి నరసింహారావు కూడా జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గోగిశెట్టి.. మొన్నటి ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటు టికెట్ ఆశించినా చివరకు బైరెడ్డి శబరికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కూడా జిల్లా అధ్యక్ష పదవి మళ్లీ తనకే వస్తోందని ఆశిస్తున్నారు.
కడపలో మహానాడులో జాతీయ అధ్యక్షుడుగా మళ్లీ చంద్రబాబు ఎంపిక కావడంతో… ఇక జిల్లాల వారీగా అధ్యక్షుల మార్పు గ్యారెంటీ అంటూ తెలుగుతమ్ముళ్లు ఆశిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నంద్యాల జిల్లా అధ్యక్ష మార్పు ఖాయమంటున్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మదిలో ఉన్న నేత ఎవరో… జిల్లా అధ్యక్ష కుర్చీలో కూర్చునే నాయకుడు ఎవరో తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.