Telangana Inter Results: తెలంగాణలో లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.
ఈ ఏడాది ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లైన tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో తనిఖీ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి 25 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడిన విషయం తెలిసిందే. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మార్చి 18నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో పత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది.
ఇది కూడా చదవండి: Jogulamba Gadwal: గద్వాల కాంగ్రెస్‌లో భగ్గుమన్న శ్రేణులు.. చితకబాదిన పోలీసులు
ఈసారి బోర్డు తొలిసారిగా రాండమ్ రీవాల్యుయేషన్ విధానాన్ని అమలు చేసింది. ముఖ్యంగా పాస్ మార్కులకు దగ్గరలో ఉన్న విద్యార్థుల పత్రాలను ప్రత్యేకంగా పరిశీలించి, అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేస్తుండటంతో, ఈసారి ముందుగానే రెండు దశల్లో పరిశీలన చేపట్టి సక్రమంగా ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. అదనంగా, నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు కూడా బోర్డు ఏర్పాట్లు ప్రారంభించింది.