Champions Trophy 2025: పాకిస్థాన్ లో నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీ పై సంచలన కథనాలు వెలువడుతున్నాయి. అసలు మ్యాచ్ ల కంటే ముందే టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళుతుందా? లేదా..? బీసీసీఐ కోరుతున్నట్లు హైబ్రిట్ మోడల్ లో మ్యాచ్ లు జరుగుతాయా..? లేదా పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు వారి గడ్డపైనే మ్యాచ్ లు జరుగుతాయా..? పాకిస్థాన్ లో మ్యాచ్ ఆడి దగ్గరలోని చండీగఢ్ లేదంటే ఢిల్లీకి టీమ్ ఇండియాను తిప్పిపంపే ప్రతిపాదన అమలౌతుందా..? ఈ విషయం మీద వస్తున్న కథనాలు ఫ్యాన్స్ లో ఉత్కంఠను పెంచుతున్నాయి.
పాకిస్థాన్ కు వెళ్లబోమని హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీని ..బీసీసీఐ కోరుతోంది. దీంతో టీమ్ ఇండియా ఆడబోయే మ్యాచ్ ల వేదికలతో పాటు ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్ చేరుకుంటే ఆ వేదికలు కూడా మారిపోతాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖండిస్తున్నా.. అలాంటి ఆలోచన ఏదీ లేదని చెబుతున్నా వార్తలు మాత్రం ఆగడం లేదు. మరి బీసీసీఐ కోరినట్లుగా హైబ్రిడ్ మోడల్ లేదంటే పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు పాకిస్థాన్ గడ్డపైనే మ్యాచ్ లు జరుగుతాయా అనే సందేహాల మధ్య మరికొన్నికొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి..
భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్‌లో టీమ్ ఇండియా ఉండటానికి ఇష్టపడకపోతే, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత తిరిగి భారత్‌కు టీమ్ వెళ్లొచ్చని బీసీసీఐకి పీసీబీ ఓ లేఖ రాసినట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అనంతరం న్యూ ఢిల్లీ లేదా చండీగఢ్‌కు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లను చేస్తామని ప్రతిపాదించి.. భారత జట్టు న్యూ ఢిల్లీ లేదా మొహాలీలో క్యాంప్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని, మ్యాచ్‌ల కోసం లాహోర్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌లను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు పాకిస్థాన్‌లో ఉండకూడదని, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత చండీగఢ్ లేదా న్యూఢిల్లీకి తిరిగి రావాలని కోరుకుంటే, బోర్డు వారికి సహాయం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనను పీసీబీ అధికారి ధ్రువీకరించారు. భారత్ చివరి 2 మ్యాచ్‌ల మధ్య ఒక వారం గ్యాప్ ఉండడమే ఈ ఆఫర్ ఇవ్వడానికి కారణంగా చెబుతున్నారు. వెలువడిన కథనాల ప్రకారం ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా, భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడంపై చర్చ జరిగింది. జైశంకర్, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు రావడంతోనే ఈ పర్యటన తర్వాత పీసీబీ ఆశలు చిగురించినట్లు తెలుస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్థాన్ పట్టుదలగా ఉండాలని భావిస్తున్నా ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఎదుట పీసీబీ ఓ ప్రతిపాదనను ఉంచిందనే వార్తలూ వచ్చిన సంగతి తెలిసిందే. దానిని మాత్రం బీసీసీఐ నిర్మోహమాటంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తమ జట్టు పాకిస్థాన్‌కే రాదని.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఆ దిశగా ఆలోచన చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా ఉండేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత్ తన మ్యాచ్ ముగిసిన వెంటనే దిల్లీకి లేదా చండీగఢ్‌కు వెళ్లిపోయేలా పీసీబీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిందని.. పాక్‌లో అడుగు పెట్టేదే లేదని స్పష్టం చేసినట్లు వెల్లడించాయి. అయితే, పీసీబీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పాక్‌కు వెళ్లాలా? వద్దా? అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుందని తెలిపాయి. మరోవైపు భారత్ తమ దేశానికి రాదని పాక్ కూడా మానసికంగా సన్నద్ధమైందని కథనాలు వచ్చాయి. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో కాకుండా.. తటస్థ వేదికల్లో నిర్వహించడమే హై బ్రిడ్ మోడల్. ఇప్పటికే గత ఆసియా కప్‌ను ఈ విధంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.