Pastor Praveen Mystery: సికింద్రాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రవీణ్ మృతిని కొందరు రాజకీయ నాయకులు, మత ప్రచారకులు హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, శాస్త్రీయ ఆధారాలతో ప్రమాదమేనని స్పష్టం చేస్తున్నా, కొందరు దీన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ వివాదం మతాల మధ్య వైషమ్యానికి దారితీసే ప్రమాదం ఉందని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు ఏపీ పౌర సమాజంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది.
పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, విచారణ క్రమంలో వారు వెలికితీస్తున్న ఆధారాలను పరిశీలిస్తే.. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్పష్టమౌతోంది. సీసీటీవీలో ఆయన వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం నివేదికలోనూ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే మరింత లోతుగా, అందుబాటులో ఉన్న మెరుగైన శాస్త్రీయ విధానాల్లో, అన్ని కోణాల్లో పరీక్షిస్తుండటంతో పోస్టుమార్టం నివేదిక రావడం ఆలస్యమౌతున్నట్లు సమాచారం. అయినప్పటికీ, కేఏ పాల్, మాజీ ఎంపీ హర్షకుమార్, జూపూడి ప్రభాకర్ రావు వంటి వ్యక్తులు దీన్ని హత్యగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వాదనల వెనుక తమ ఉనికిని చాటుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
Also Read: Cm revanth: మేం ఇక ఢిల్లీకి రాబోం, ప్రధాని మోదీ మా గల్లీకి రావాలి
Pastor Praveen Mystery: ఈ వివాదంలో ప్రవీణ్ మరణాన్ని రాజకీయం చేయడం వల్ల ఆయన పరువుకే భంగం కలుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక మత ప్రచారకుడి మరణాన్ని ఆధారంగా చేసుకుని, మత రాజకీయాలకు తెరలేపడం వల్ల సమాజంలో చిచ్చు రేగే అవకాశం ఉంది. గతంలో వివేకానందరెడ్డి మరణాన్ని కూడా ఇలాగే వాడుకుని రాజకీయం చేసినట్లు గుర్తుచేస్తున్నారు నిపుణులు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ అదే తరహా కుట్ర జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఈ అంశాన్ని సున్నితంగా డీల్ చేస్తున్నప్పటికీ, కొందరు వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక రాష్ట్రంలో అశాంతి కల్పించాలనే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రజలు వాస్తవాలను గ్రహించి, రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తపడాలని మేధావులు సూచిస్తున్నారు. శాంతి, సహనం ప్రబోధించే మత పెద్దలు సైతం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
చివరగా, ఆధారాలతో కూడిన విచారణను విశ్వసించి, ఊహాగానాలకు దూరంగా ఉండటమే ఈ సమస్యకు పరిష్కారం. లేకపోతే, రాజకీయ జోకర్ల చేతిలో రాష్ట్ర శాంతి బలవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.