KCR Master Plan: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఈరోజు (మంగళవారం) తెలంగాణ భవన్‌లో జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ, మండలిలో పార్టీ వ్యూహంపై చర్చించి, అనుసరించాల్సిన దిశను కేసీఆర్ స్పష్టతనిస్తారని సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యూహరచన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌పై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సమీక్ష జరిపి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ముఖ్యంగా రైతు సమస్యలు, ఆర్థిక పరిస్థితి, ఏపీతో నీటి పంపకాల అంశాలను సభలో ప్రస్తావించాలని కేసీఆర్ సూచించనున్నట్టు సమాచారం.
కీలక అంశాలపై బీఆర్ఎస్ దృష్టి
- రైతాంగ సమస్యలు: ధాన్యం కొనుగోలు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి అంశాలను లేవనెత్తాలని నిర్ణయం.
- ఎస్సీ వర్గీకరణ: ఎస్సీ వర్గీకరణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రశ్నించాలని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
- బీసీల రిజర్వేషన్లు: బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై సభలో చర్చించాలని నిర్ణయం.
ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరు
ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరుకానున్నారు. సభకు హాజరయ్యే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శక్తిమేరకు ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది.ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ నేతలు మీడియా ద్వారా తమ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: BRS Silver Jubilee Meeting: లక్షన్నర మందితో సభా? అది అవ్వదమ్మా!