Gold smuggling: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు రన్యా రావు అరెస్ట్ కావడంపై ఐపీఎస్ అధికారి రామచంద్రరావు స్పందించారు. బుధవారం (మార్చి 5) మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయం తన దృష్టికి మీడియా ద్వారానే వచ్చిందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను కూడా షాక్‌కు గురయ్యానని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలియవని చెప్పారు.
ఇతర తండ్రుల మాదిరిగానే తన కూతురు అరెస్ట్ అయ్యిందన్న విషయం తెలుసుకున్నప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతి చెందినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై తనకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని స్పష్టం చేశారు. చట్టం తన విధిని నిర్వర్తిస్తుందన్న నమ్మకం తనకు ఉందని, ఇప్పటి వరకు తన కెరీర్‌పై ఎలాంటి నల్ల మచ్చ లేదని తెలిపారు.
ప్రస్తుతం తన కూతురు తమతో కలిసి ఉండదని, భర్తతో కలిసి వేరే జీవిస్తున్నట్టు చెప్పారు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా తమకు దూరంగా ఉంటోందని వివరించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు అరెస్ట్ అయిన వ్యవహారంలో తాను దూరంగా ఉంటానని, ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని అన్నారు.