CBSE Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యార్థులకు కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త విధానం 2026 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్‌వీఎస్ అధికారులు చర్చించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి, వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.
ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని, మరింత మెరుగైన మార్కులు సాధించేందుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. రెండు పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలకు హాజరవ్వడం పూర్తి స్వేచ్ఛగా ఉంటుందని తెలిపారు. జేఈఈ తరహాలో 10, 12 తరగతుల విద్యార్థులు తమకు అనుకూలంగా పరీక్షలు రాయొచ్చు.
ఇది కూడా చదవండి: Yash: యష్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ టాక్సిక్!
అదనంగా, 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ కరిక్యులమ్ ప్రవేశపెట్టాలని సీబీఎస్‌ఈ యోచిస్తోంది. ఈ కరిక్యులమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో ఒకే విధమైన సిలబస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలు ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించి, మేలో ఫలితాలు విడుదల చేస్తుంది. ఫెయిలైన వారికి జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, కొత్త విధానం ద్వారా విద్యార్థులకు మరింత సౌలభ్యం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ విధానం యూజీ ప్రవేశాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించనున్నట్లు సమాచారం. దీని ద్వారా విద్యార్థులు తమకు అనువైన సమయానికి పరీక్షలు రాసేందుకు అవకాశముంటుందని తెలిపారు.