Delhi Elections: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బీజేపీ జయభేరి మోగిస్తున్నది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే అత్యధిక స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీదే పైచేయిగా కనిపిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా తనకు ఎదురు నిలిచిన కీలక నేతలను ఒక్కొక్కరిగా మట్టికరిపిస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్‌ను మట్టికరిపించే పనిలో ఉన్నది. తాజాగా అందిన సమాచారం మేరకు బీజేపీ 40 స్థానాల్లో, ఆప్ 30 స్థానాల్లో తమ ఆధిక్యత కొనసాగిస్తున్నాయి. దీంతో బీజేపీకి అధికారం దగ్గరయ్యే అవకాశం ఉన్నదనే విషయం తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో మూడోస్థానానికి పరిమితమై చతికిలపడింది.
27 ఏండ్ల తర్వాత బీజేపీకి అవకాశం
Delhi Elections: 27 ఏండ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది. 70 స్థానాలకు గాను 36 స్థానాల్లో విజయం దక్కిన పార్టీకి అధికారం దక్కుతుంది. దీంతో తాజగా 43 స్థానాలకు ఎగబాకడంతో సునాయసంగా బీజేపీకి అధికారం దక్కే అవకాశం ఉన్నది. ఫలితాలు కూడా ఇదే రీతిన ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఆప్, కాంగ్రెస్ కలిసుంటే..
Delhi Elections: ఇండియా పక్షంలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడంతో ఆ రెండు పార్టీలను దెబ్బకొట్టింది. ఆప్ మ్యాజిక్ ఫిగర్ అందనంత దూరంలో ఉండగా, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో మూడో స్థానానికే పరిమితమైంది. అయితే ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే ఓటింగ్ శాతాన్ని బట్టి ఈ రెండు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ 44 శాతం, కాంగ్రెస్ 7 శాతం ఓట్ల షేర్ కలిపితే ఈ కూటమిదే ఆధిక్యత ఉండేదని ఆధారం చూపుతున్నారు.
Delhi Elections: ఎన్నికల లెక్కింపు తొలిరౌండ్‌లో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెనుకంజలో ఉండగా, ఆ తర్వాత రౌండ్లలో స్వల్ప ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతీశీ మాత్రం ఆప్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చివరిదాకా చూడండి.. ఆప్‌దే విజయం వరిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పదనిసలు
Delhi Elections: ఓట్ల లెక్కింపులో పదనిసలు కొనసాగుతున్నాయి. ఆప్ కీలక నేతలైన అవధ్ ఓజా, సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, అమానతుల్లాఖాన్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ కీలకనేతలైన తర్వీందర్ సింగ్ మార్వా, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా వెనుకంజలో ఉన్నారు. మూడు రౌండ్ల వరకు బీజేపీ 40కి పైగా స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, ఆప్ 30 లోపు స్థానాల్లోనే ఆధిక్యతలో ఉండగా, నెమ్మదిగా తాజా పరిస్థితుల్లో బీజేపీ 40కి చేరుకోగా, ఆప్ 30కి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.