Chhaava controversy: విక్కీ కౌశల్, రశ్మిక మందణ్ణ జంటగా నటించిన ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘ఛావా’ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ జీవిత గాధ ఆధారంగా ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించాడు. ట్రైలర్ కు మంచి అప్లాజ్ వస్తోంది. అయితే ఇదే సమయంలో శంభాజీ జీవితాన్ని దర్శక నిర్మాతలు కమర్షియలైజ్ చేశారంటూ కొన్ని మరాఠా సంస్థలు విమర్శిస్తున్నాయి. మొదటి నుండి శంభాజీకి సంబంధించిన అంశాలను చరిత్రకారులతో చర్చించి వీలైనంత వాస్తవంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించమని తాము చెబుతున్నామని కానీ దానిని మేకర్స్ పట్టించుకోలేదని వారు కినుక వహిస్తున్నారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయన తన భార్యతో కలిసి వీధుల్లో నృత్యం చేసే సన్నివేశం, ఆయనతో వేయించిన స్టెప్పులూ అభ్యంతర కరంగా ఉన్నాయని వారు అంటున్నారు. సినిమా విడుదల సమయానికి ఇలాంటి వాటిని తొలగించకపోతే తప్పకుండా నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
