Thalla Pellama: యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘తల్లా?పెళ్ళామా?’… 1970 జనవరి 8వ తేదీన విడుదలైన ‘తల్లా పెళ్ళామా’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. పేదవాడైన హీరోని ఓ కోటీశ్వరుని కూతురు ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఆ తరువాత భర్తను తనతో తీసుకువెళ్తుంది. దూరమైన కన్నతల్లి ఆవేదనను అర్థం చేసుకున్న తనయుడు భార్యను ఎలా దారిలో పెట్టాడు అన్నదే ఈ కథ. చూడటానికి ఇది కుటుంబకథాచిత్రమే అయినా పాటల్లో అప్పటి రాజకీయ పరిస్థితులను సున్నితంగా విమర్శించారు యన్టీఆర్. ఈ చిత్రంలో నాయికగా చంద్రకళ నటించగా, తల్లి పాత్రలో శాంతకుమారి అభినయించారు. దేవిక, నాగభూషణం, రమణారెడ్డి, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లోకనిపించారు. ఇందులో యన్టీఆర్ తనయుడు హరికృష్ణ బాలనటునిగా మురిపించారు. ఈ చిత్రానికి సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు పలికించగా, టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. అప్పట్లో జై ఆంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ‘విశాలాంధ్ర’కే ఓటేస్తూ ‘పాలుపొంగు మన తెలుగుగడ్డను పగలగొట్టవద్దు’ అని యన్టీఆర్ తన అభిప్రాయాన్ని పాటలో పలికింప చేశారు. మంచి విజయం సాధించిన ‘తల్లా పెళ్ళామా’ రిపీట్ రన్స్ లోనూ సత్తా చాటింది.