KTR: తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో నందినగర్‌లోని తన నివాసం నుంచి ఆయన వెళ్లారు. వెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ వెళ్తుండగా, నినాదాలు చేస్తున్న వారిని వారించారు. ఇదిలా ఉండగా, బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ఎదుట కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయవాదులు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదు అంటూ పోలీసులు నిలిపేశారు. చట్టప్రకారం ప్రతిపౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ కోరారు. అయినా ఉద్రిక్తత నెలకొన్నది.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరవుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాష్ట్రంలోని వివిధ చోట్ల 100 మందికి పైగా బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినట్టు వార్తలు వచ్చాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
KTR: ఈ నెల 6న సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 3న ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. పలువురు న్యాయ నిపుణుల సూచనల మేరకు ఆయన విచారణకు హాజరవుతానని కేటీఆర్ ఇటీవలే చెప్పారు. అయితే తొలుత గత నెల 19న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా ఇదే కేసును విచారణకు స్వీకరించింది. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
KTR: కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకూ ఆయనను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అయితే విచారణను కొనసాగించవచ్చని పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం విచారణకు కేటీఆర్ హాజరైన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది.
KTR: మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో కేటీఆర్‌తోపాటు నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్‌కుమార్‌లను ఈ నెల 2, 3 తేదీల్లోనే విచారణకు ఆహ్వానించగా, వారు కొంత గడువును కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వరకు గడువు ఇచ్చారు.