Tummala nageshwar rao: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రైతులకు పెద్ద ఎత్తున చేకూరిన ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు, రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు.ఈనెల 28 , 29 , 30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహా, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణా రావు లు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..
ఈనెల 28 న ఉదయం 10 గంటలకు ఈ రైతు సదస్సు ప్రారంభమవుతుందని, ఈ మొదటి రోజు సదస్సుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, ఈ ప్రారంభ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గా తాను ప్రారంభిస్తానని, ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తుమ్మల చెప్పారు. రెండోరోజైన 29 న మహబూబ్ నగర్ జిల్లాయేతర ప్రాంతాలనుండి రైతులు హాజరవుతారని, 30 న రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి కనీసం లక్ష మంది రైతులు ఈ రైతు సదస్సుకు హాజరవుతారని వివరించారు.
మొదటి రెండు రోజులు ప్రతీ రోజు 5000 మంది రైతులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 30 వ తేదీన సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి, వివిధ రకాల పంట రీతులు, హైబ్రిడ్ వంగడాలు, ప్రభుత్వం అమలుచేస్తున్న పలు పథకాలపై ప్రదర్శన స్టాళ్ళను సంబంధిత శాఖలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ మూడురోజుల కార్యక్రమాలను రాష్ట్రంలోని 560 రైతు వేదికల ద్వారా లైవ్ ప్రసారం చేయాలని వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశించారు.

