Nirmal : నిర్మల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఐదు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. వెంటనే ఫ్యాక్టరీ పనులను నిలిపివేసి తరలించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ – గుండంపల్లి గ్రామాల మధ్య పరిశ్రమను నిర్మిస్తుండగా ఐదు గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు దిలావర్ పూర్ వద్ద నిర్మల్ – భైంసా ప్రధాన రహదారిపై బైఠాయించారు.
దిలావర్పూర్, గుండంపెల్లితో పాటు సముందర్ పల్లి , టెంబుర్ని, సిర్గాపూర్ కాండ్లీ గ్రామాల రైతులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో షాపులను స్వచ్ఛందంగా మూసివేయడమే కాకుండా స్కూళ్లను బంద్ పెట్టి నిరసన తెలిపారు. రాత్రి వరకు రాస్తారోకోను కొనసాగిస్తుండగా.. రైతులకు నచ్చచెప్పేందుకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని అడ్డుకున్నారు. రాస్తారోకోతో ఇరువైపులా దాదాపు పది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రైతుల నిరసన ప్రేమించేందుకు ఆర్డిఓ చాలా సేపు శ్రమించారు. తర్వాత వాళ్లకు నచ్చచెప్పి విరమించారు.