Puthur Zoo Deer Deaths

Puthur Zoo Deer Deaths: దారుణం.. వీధి కుక్కల దాడిలో 10 జింకలు మృతి

Puthur Zoo Deer Deaths: కేరళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన త్రిశూర్‌లోని కొత్త జంతుప్రదర్శనశాలైన పుత్తూర్ జూలాజికల్ పార్క్ లో పెను భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. నూతనంగా ప్రారంభించిన ఈ జూలోకి వీధి కుక్కలు ప్రవేశించి, 10 జింకలను చంపేశాయి. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగినట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం, జింకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆవరణలో ఉన్న 20 జింకలలో 10 జింకలు చనిపోయి కనిపించాయి. వాటిని వీధి కుక్కల గుంపు దాడి చేసి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 336 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ పార్కును ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబరు 28న అట్టహాసంగా ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Dharmendra: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!

ఆసియాలో రెండవ అతిపెద్ద, భారతదేశంలోనే మొట్టమొదటి డిజైనర్ జూ గా దీనికి పేరుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన జూలోకి వీధి కుక్కలు చొరబడి జంతువులను వేటాడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంతు ప్రేమికులు, పర్యావరణవేత్తలు జూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఎ.కె. శశీంద్రన్ వెంటనే విచారణకు ఆదేశించారు. చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ప్రమోద్ జి. కృష్ణన్ , చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా నేతృత్వంలో ఒక బృందం జూను సందర్శించి, విచారణ ప్రారంభించింది. మృతి చెందిన జింకలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా వాటి మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. జూ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ, నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నందున కార్మికులు పారవేసే ఆహార వ్యర్థాల కారణంగా వీధి కుక్కలు ఆ ప్రాంగణంలోకి వస్తున్నాయని అంగీకరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భద్రతాపరమైన లోపాలను సరిదిద్దాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *