YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సంక్షేమం, అభివృద్ధి అంశాలపై ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “ఇది కేవలం చంద్రబాబుతో యుద్ధం కాదు.. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ప్రజలకు నిజం తెలిసేలా చేయాలి. నాణానికి ఒకవైపు మాత్రమే చూపడం కాదు, రెండో వైపు కూడా చూడాలి అంటూ జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వంపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు తన చేతిలో అభివృద్ధి మంత్రం ఉందని చెబుతుంటే, వాస్తవాలు ఏం చెబుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబు పాలనపై కఠిన వ్యాఖ్యలు
ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామని చెప్పారు. కానీ కాగ్ నివేదిక చూస్తే అభివృద్ధి కాణం లేదు. సంక్షేమం అన్న మాటే లేదు అని జగన్ వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలం పాలన మోసాలతో నిండిపోయిందని, పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని చెప్పారు.
కోవిడ్ సమయంలో కూడా గోప్ప పాలన
తమ పాలనలో కోవిడ్ అనే మహమ్మారి సమయంలో కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, స్థిరమైన పరిపాలన అందించామని జగన్ జ్ఞప్తికి తెచ్చారు.
వైసీపీ హయాంలో శ్రీలంకా అయిందా?
వైసీపీ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలు తెలివిగా ఉన్నారు. ఎప్పుడు ఎవరు నిజాలు చెబుతున్నారో, ఎవరు మాయలు చేస్తున్నారో గుర్తించగలుగుతున్నారు అంటూ జగన్ చెప్పారు.