Viral Video: బస్సులు, లోకల్ రైళ్లలో సీటు కోసం జరిగే గొడవలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో మహిళల కోచ్‌లో ఈ వాగ్వాదాలు సర్వసాధారణం. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిన ఒక ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. లోకల్ రైలులో కేవలం సీటు విషయంలో గొడవ జరగడంతో ఓ మహిళ ఏకంగా తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగింది?
కోల్‌కతాలోని సీల్దా స్టేషన్లో ఒక లోకల్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకుపచ్చ కుర్తా ధరించిన ఒక మహిళ రైలులో సీటు కోసం ఓ యువతితో గొడవ పడింది. ఈ వాగ్వాదం పెరిగిపోవడంతో, కోపం తట్టుకోలేకపోయిన ఆ మహిళ తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే తీసి చల్లడానికి ప్రయత్నించింది.
అయితే, పక్కనే ఉన్న మరో మహిళ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ మహిళ ఇష్టం వచ్చినట్లుగా కోచ్‌లో పెప్పర్ స్ప్రే చల్లింది.
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది
పెప్పర్ స్ప్రే కోచ్ మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న ప్రయాణికులు, చివరకు ఆ మహిళతో పాటు ప్రయాణిస్తున్న ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఊపిరి ఆడక దగ్గడం, ఇబ్బంది పడడం కనిపించింది. ఈ చర్యతో ఆగ్రహించిన తోటి ప్రయాణికులు సదరు మహిళపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఇలాంటి పనిచేయడం ఎంతవరకు సరైందని ఆమెపై కోపంతో అరిచారు.
View this post on Instagram
చివరికి, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఆ మహిళను అడ్డుకున్నారు. అనంతరం ఆమెను రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని అమృతా జిలిక్ అనే ప్రయాణికురాలు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోతో సహా పంచుకున్నారు.
పెప్పర్ స్ప్రే దుర్వినియోగంపై విమర్శలు
వ్యక్తిగత భద్రత కోసం ఉద్దేశించిన పెప్పర్ స్ప్రేను సీటు కోసం ఇలా ఆయుధంలా వాడడాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. సెప్టెంబర్ 26న షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. “కొంతమంది తమ భద్రత కోసం ఇచ్చిన వస్తువులను ఇతరులపై దాడి చేయడానికి దుర్వినియోగం చేస్తున్నారు,” “నిజంగా ఇది ఎంత తప్పు” అంటూ నెటిజన్లు ఆ మహిళ చర్యను తీవ్రంగా విమర్శిస్తున్నారు.