Winter Lip Care: శీతాకాలం వచ్చేసరికి చలి గాలులు మన చర్మంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పెదవులు పొడిబారడం, పగిలిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. చాలా మంది దీన్ని సాధారణ సీజనల్ సమస్యగా తీసుకుంటారు. కానీ వైద్యులు చెబుతున్నట్టుగా, పెదవులు పగిలిపోవడం కేవలం వాతావరణం వల్లే కాకుండా శరీరంలో కొన్ని పోషక లోపాల వల్ల కూడా జరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం పెదవులు పొడిబారి పగిలిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
విటమిన్ బీ12 మన శరీరంలో అత్యంత ముఖ్యమైన పోషకం. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరం. ఈ విటమిన్ తక్కువగా ఉంటే రక్తహీనత, అలసట, జ్ఞాపకశక్తి సమస్యలు, తిమ్మిరి, చర్మం పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా పెదవులు పగిలిపోవడం కూడా దీనికి ఒక సూచనగా చెప్పవచ్చు.
శరీరంలో విటమిన్ బీ12 స్థాయిని పెంచుకోవడానికి ఆహారంలో కొన్ని పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. గుడ్లు, పాలు, పెరుగు, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులు కూడా తీసుకుంటే లోపాన్ని భర్తీ చేయవచ్చు. మాంసాహారులు కాకపోయిన వారు, వెజిటేరియన్లు అయితే, డాక్టర్ సలహాతో విటమిన్ బీ12 సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
Also Read: Olive Oil: ఆలివ్ ఆయిల్: ఆరోగ్య రహస్యం.. దీని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!
చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం కూడా పెదవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చల్లని గాలి పెదవుల సున్నితమైన చర్మం నుంచి తేమను దూరం చేస్తుంది. దీంతో అవి పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి. అలాగే నీరు తాగడం తగ్గిపోవడం, స్మోకింగ్ చేయడం, సూర్యకిరణాలకు ఎక్కువసేపు ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కూడా పెదవులు దెబ్బతింటాయి. ఇంట్లో హీటర్ వాడే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే హీటింగ్ గాలి మరింత పొడిబారేలా చేస్తుంది.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. అలాగే షియా బటర్, గ్లిజరిన్, సిరమైడ్స్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న లిప్ బామ్ వాడితే పెదవులు తేమగా ఉంటాయి. ఆల్కహాల్ లేదా మిథనాల్ ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. వారానికి రెండు మూడు సార్లు లిప్ స్క్రబ్ వాడటం వల్ల పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అలాగే SPF 15 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిప్ బామ్ వాడితే ఎండలో పెదవుల రక్షణ పొందవచ్చు.
పెదవులు మన ముఖానికి అందాన్ని ఇస్తాయి. అందుకే వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. చలికాలంలో చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, లిప్ కేర్ కూడా అంతే ముఖ్యం. సరైన ఆహారం, తగినంత నీరు, నాణ్యమైన లిప్ బామ్ వాడటం — ఈ మూడు అలవాట్లు పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

